reliance jio: 138.6 మిలియన్లకు చేరుకున్న రిలయన్స్ జియో వినియోగదారులు
- 378 కోట్ల జీబీ వాడుతున్న జియో సబ్‌స్క్రైబర్లు
- సగటున రోజుకి 276 కోట్ల నిమిషాల మాటలు
- వెల్లడించిన రిలయన్స్ జియో
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కంపెనీ తమ త్రైమాసిక ఆర్థిక పనితీరు లెక్కలను శుక్రవారం వెల్లడించింది. సెప్టెంబర్ 30 నాటికి తమ వినియోగదారుల సంఖ్య 138.6 మిలియన్లకు చేరుకున్నట్లు తెలిపింది. ఈ ఒక్క త్రైమాసికంలోనే 19.6 మిలియన్ల మంది కొత్తగా జియో వాడటం ప్రారంభించినట్లు పేర్కొంది. తమ వినియోగదారులంతా కలసి సగటున రోజుకి 276 కోట్ల నిమిషాల సేపు మాట్లాడుతున్నారని తెలిపింది. ఇక డేటా వాడకం విషయంలో 378 కోట్ల జీబీ ఉపయోగించారని తెలియజేసింది.
ఒక్కో వినియోగదారుడి నుంచి నెలకు రూ. 156.4 యావరేజ్ రెవెన్యూగా వచ్చిందని జియో తెలిపింది. ఒక్కో వినియోగదారుడు నెలకు 9.62 జీబీ డేటా వినియోగిస్తున్నట్లు వివరించింది. తమ నెట్‌వర్క్ ద్వారా ఇప్పటికి 178 కోట్ల గంటల సేపు వీడియోలు ప్రసారమయ్యాయని పేర్కొంది. ఈ త్రైమాసికంలో 27 మిలియన్ల ఎల్‌టీఈ స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోతే, అందులో 2/3వ వంతు మంది జియో నెట్‌వర్క్‌నే ఎంచుకున్నట్లు పేర్కొంది. మొత్తంగా చూస్తే దేశంలో 160 మిలియన్ల ఎల్‌టీఈ స్మార్ట్‌ఫోన్లలో జియో ఉపయోగిస్తున్న వారు 85 శాతం ఉన్నారు.