PV Narasimha Rao: నేను 'యాక్సిడెంటల్'గా రాజకీయాల్లోకి వచ్చా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ప్రధాని పదవి దక్కకపోవడంపై ప్రణబ్ అసంతృప్తి చెందారన్న మాజీ ప్రధాని
- పీవీ ఆహ్వానంతోనే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడి
- ట్విట్టర్లో పేలుతున్న జోకులు
దేశానికి వరుసగా రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను యాక్సిడెంటల్‌గా (అనుకోకుండా) రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త పుస్తకం ఆవిష్కరణ సభలో మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు తనను కేబినెట్లోకి ఆహ్వానించి ఆర్థిక మంత్రిని చేశారని గుర్తు చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ప్రణబ్‌ను ప్రధానిగా ఎన్నుకోకపోవడంతో ఆయన బాధపడే ఉంటారని పేర్కొన్నారు.
మన్మోహన్ వాఖ్యలపై ట్విట్టర్లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. నిజమా? అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తే, ఆ ప్రమాదం కారణంగా పదేళ్లు భరించాల్సి వచ్చిందని మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక నుంచి మిమ్మల్ని యాక్సిడెంటల్ పీఎం అని పిలుస్తామని మరికొందరు కామెంట్ చేశారు. రిమోట్ కంట్రోల్ ద్వారా మీరు ప్రధాని అయ్యారని ఇంకొకరు పోస్ట్ చేశారు. కాదు.. మీకంటే ముందు దేవగౌడ అయ్యారని మరికొందరు కామెంట్ చేశారు.