Maoist commander: మాజీ మంత్రిని చంపేందుకు రూ.5 కోట్లు తీసుకున్నా.. సంచలన విషయాన్ని వెల్లడించిన మావోయిస్ట్ కమాండర్

  • జార్ఖండ్ మాజీ మంత్రిని చంపేందుకు మరో మాజీ మంత్రి స్కెచ్
  • మావోయిస్టులతో ఒప్పందం.. 2008లో హత్య
  • అడ్వాన్స్‌గా రూ. 3 కోట్లు చెల్లింపు
  • మిగతా రూ.2 కోట్లతో పరారైన మరో మావోయిస్ట్
  • ఎన్ఐఏ అదుపులో మాజీ మంత్రి

జార్ఖండ్ మాజీ మంత్రి రమేష్ సింగ్ ముండాను హత్య చేసేందుకు రూ.5 కోట్లు తీసుకున్నట్టు జైల్లో ఉన్న మావోయిస్ట్ కమాండర్ కుందన్ పహాన్ వెల్లడించాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) జరిపిన ఇంటరాగేషన్‌లో ఈ విషయం వెల్లడైంది.

పోలీసుల కథనం ప్రకారం.. 2008లో జేడీయూ నేత అయిన రమేష్ ముండా హత్య కోసం మరో మాజీ మంత్రి గోపాల కృష్ణ పటార్‌ అలియాస్ రాజా పీటర్‌తో కుందన్ రూ. 5 కోట్లకు కాంట్రాక్ట్ కుదుర్చున్నాడు.

ముండా హత్య కేసులో రాజా పీటర్‌ను సోమవారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూలై 2008లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ముండాను మావోయిస్టు గెరిల్లాలు కాల్చి చంపారు.

ఈ హత్యకు గాను పీటర్ తొలుత రూ.3 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించారు. ముండా హత్య తర్వాత మిగతా రూ. రెండు కోట్లను చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ముండా హత్య తర్వాత సీపీఐ-మావోయిస్ట్ పొలిట్ బ్యూరోకు మిగతా రూ.2 కోట్లు అందలేదు. మావోయిస్ట్ కమాండర్ బలరామ్ సాహు ఆ డబ్బులు తీసుకుని పరారయ్యాడు. తర్వాత బలరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజా పీటర్‌కు అంత పెద్దమొత్తంలో డబ్బులు ఎలా వచ్చాయి? వాటిని ఎవరు సమకూర్చారు? అన్న విషయంపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం రాజా పీటర్ ఎన్ఐఏ రిమాండ్‌లో ఉన్నాడు. ముండా హత్య కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ జైల్లో ఉన్న మావోయిస్టులను కూడా విచారించాలని నిర్ణయించింది.

2009 ఉప ఎన్నికల్లో  అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం చీఫ్ శిబు సోరెన్‌ను రాజా పీటర్ ఓడించి చరిత్ర సృష్టించారు. ముండా హత్యకేసులో ఆయన బాడీ గార్డు అయిన ఎస్సై శేష్‌నాథ్ సింగ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముండా కదలికలపై మావోయిస్టులకు ఆయనే సమాచారం ఇచ్చాడన్న ఆరోపణలున్నాయి.

  • Loading...

More Telugu News