కిడ్నాప్: తమ స్నేహితురాలిని దుండగులు ఎత్తుకెళ్లారని పోలీసులకు విద్యార్థుల ఫిర్యాదు!
- గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో అలజడి
- విద్యార్థులు పాఠశాల ఎదుట ఆడుకుంటోన్న సమయంలో ఘటన
- సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసుల గాలింపు
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో కలకలం చెలరేగింది. ఆ గ్రామంలోని ఓ పాఠశాల బయట పిల్లలు ఆడుకుంటుండగా అందులో ఒక బాలికను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనపై తీవ్ర భయాందోళనలకు గురైన తోటి విద్యార్థులు దగ్గరలో ఉన్న పోలీసులకు ఈ విషయాన్ని చెప్పారు. తామంతా స్కూలు ఎదుట ఉండగా ఎరుపు రంగు కారులో వచ్చిన కొందరు దుండగులు తమ స్నేహితురాలిని బలవంతంగా లాక్కెళ్లిపోయారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.