Akhilesh Yadav: చాలా కాలం తర్వాత కలుసుకున్న తండ్రీకొడుకులు.. ములాయంకు పాదాభివందనం చేసిన అఖిలేష్!
- పది నెలల తర్వాత కలుసుకున్న తండ్రీ కొడుకులు
- విభేదాలకు ఇక పుల్‌స్టాప్ పడినట్టేనా?
- త్వరలోనే ఒక్కటవుతారంటున్న విశ్లేషకులు
దాదాపు పదినెలల తర్వాత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా తండ్రి పాదాలకు అఖిలేష్ నమస్కారం చేశారు. లక్నోలో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకుని చేతులూపుతూ ఫొటోలకు పోజివ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తండ్రీకొడుకులు ఇద్దరూ కలుసుకోవడంతో సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి.
సోషలిస్ట్ నేత రామ్ మనోహర్ లోహియా 50వ వర్ధంతి సందర్భంగా లోహియా విగ్రహానికి ములాయం పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇదే కార్యక్రమానికి హాజరైన అఖిలేష్ యాదవ్ తండ్రిని పలకరించి కాళ్లకు నమస్కరించారు. కార్యకర్తలతో కలిసి నినాదాలు చేశారు. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజిచ్చారు. దీంతో ఇరువురి మధ్య ఇప్పటి వరకు నెలకొన్న విభేదాలకు ఇక పుల్‌స్టాప్ పడినట్టేనని, ఇద్దరూ తిరిగి ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు పొడసూపాయి. పార్టీ చీఫ్ పదవి నుంచి ములాయంను తొలగించిన కుమారుడు అఖిలేష్ తానే పగ్గాలు చేపట్టారు. ములాయం ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు కూడా. గతవారం నిర్వహించిన పార్టీ మీట్‌కు కూడా ములాయం హాజరుకాలేదు. ఈ సమావేశంలో అఖిలేష్‌నే తిరిగి పార్టీ చీఫ్‌గా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అఖిలేష్ ఐదేళ్లపాటు కొనసాగనున్నారు.
కాగా, ఇన్నాళ్లుగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న తండ్రీకొడుకులిద్దరూ ఆప్యాయంగా పలకరించుకోవడం, కలిసి ఫొటోలకు పోజివ్వడంతో ఇన్నాళ్లూ వారిమధ్య నెలకొన్న వివాదాలు సమసిపోయినట్టేనని చెబుతున్నారు. త్వరలోనే వారిద్దరూ ఒక్కటవుతారని అంటున్నారు.