U.S. warship: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నౌక.. యుద్ధ విమానాలను రంగంలోకి దింపిన డ్రాగన్ కంట్రీ!

  • కలకలం రేపిన అమెరికా యుద్ధనౌక
  • పరాసెల్ ద్వీపంపై చైనా వాదనలను అంగీకరించని యూఎస్
  • దానిపై తమకూ హక్కు ఉందంటున్న వియత్నాం, తైవాన్

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని పరాసెల్ ద్వీపం సమీపంలో అమెరికా యుద్ధ నౌక కనిపించడం కలకలం రేపుతోంది. దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అమెరికా యుద్ధ నౌక అటువైపుగా కదిలి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.  చైనా వాదనలను ఏమాత్రం అంగీకరించని అమెరికా ఈ ద్వీపంపై చైనా సార్వభౌమాధికారాన్ని ఎంతమాత్రమూ అంగీకరించడం లేదు. కాగా, ఈ వివాదాస్పద ప్రాంతంపై తమకూ హక్కు ఉందని వియత్నాం, తైవాన్ కూడా చెబుతున్నాయి.

ఉత్తర కొరియా క్షిపణి, అణ్వస్త్ర పరీక్షలకు చైనా మద్దతుగా నిలవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నట్టు అమెరికా అధికారులు చెబుతున్నారు. అమెరికా యుద్ధ నౌక దక్షిణ చైనా సముద్రంలో సంచరించడం వెనక చైనాకు చెక్ చెప్పాలనే వ్యూహం ఉన్నట్టు వారు తెలిపారు. అమెరికా యుద్ధ నౌకను హెచ్చరించేందుకు ఓ యుద్ధ నౌక, రెండు యుద్ధ విమానాలు, ఓ హెలికాప్టర్‌ను రంగంలోకి దించినట్టు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా తన తప్పులను సరిచేసుకుంటే మంచిదని హెచ్చరికలు పంపింది. పరాసెల్ దీవి ఎప్పటికీ చైనా భూభాగమేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ పునరుద్ఘాటించారు.

  • Loading...

More Telugu News