జగన్: ఆ ఉద్దేశంతోనే ప్రత్యేక హోదా ఉద్యమానికి ఆరు నెలల విరామం ఇచ్చాం.. ఇక పోరాటమే: జగన్
- విరామం ఇచ్చిన ఈ ఆరు నెలల కాలంలో ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడారా?
- హైదరాబాద్ ని అభివృద్ధి చేయడానికి 60 ఏళ్లు పట్టింది
- రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయాం
- విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయన్న ఉద్దేశంతోనే హోదా ఉద్యమానికి విరామం ఇచ్చా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి గళం విప్పారు. హోదా పేరుతో ఓట్లు పొంది, అధికారంలోకి వచ్చిన నేతలు ఆ తరువాత ప్లేటు ఫిరాయించారని ఉద్ఘాటించారు. ఈ రోజు అనంతపురం పట్టణంలో నిర్వహించిన యువభేరిలో జగన్ మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఎన్నో మార్పులను చూసి ఉండేవాళ్లమని చెప్పారు. ఏపీకి ఎన్నో పెట్టుబడులు వచ్చేవని చెప్పారు. ఆంధ్ర యువత ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లే అవసరం లేకుండా పోయేదని చెప్పారు.
రాష్ట్ర విభజనతో ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని జగన్ చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పోరాడదామని పిలుపునిచ్చారు. విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయన్న ఉద్దేశంతో హోదా ఉద్యమానికి విరామం ఇచ్చామని చెప్పారు. తాము విరామం ఇచ్చిన ఈ ఆరు నెలల కాలంలో ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ నుంచి గల్లీ దాకా రెండు నిరాహార దీక్షలు జరిగాయని జగన్ చెప్పారు.
ప్రధాని మోదీని చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని ఎందుకు అడగడం లేదని జగన్ ప్రశ్నించారు. హైదరాబాద్ ని అభివృద్ధి చేయడానికి 60 ఏళ్లు పట్టిందని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయామని చెప్పారు. అప్పట్లో హోదా 6 కాదు, 10 కాదు, 15 ఏళ్లు కావాలని మాట్లాడారని జగన్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రత్యేక హోదా సంజీవని కాదని అంటున్నారని తెలిపారు. అనంతపురం లాంటి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతపురానికి కేంద్ర విశ్వవిద్యాలయం వస్తుందని, ఎయిమ్స్‌కు అనుబంధ కేంద్రం పెడతామని, నూతన పారిశ్రామిక నగరంగా చేస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నో గొప్పలు చెప్పుకున్నారని, అయితే ఇంతవరకు చేసిందేంటని జగన్ ప్రశ్నించారు.