beggar: ఇది సినిమా కాదు... కానీ, నిజంగా 'బిచ్చగాడు' కథే!
- ఇంటిపై అలిగి కోటీశ్వరుడి భిక్షాటన
- 3 నెలలపాటు ఆలయం ముందే మకాం.. ప్రసాదమే భోజనం
- కుటుంబం మొత్తం బతిమాలడంతో మెత్తబడ్డ బిచ్చగాడు
విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన 'బిచ్చగాడు' సినిమా ఆమధ్య ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బిలియనీర్ అయిన హీరో తల్లి ఆరోగ్యం కోసం 'బిచ్చగాడి'గా మారిన కథతో ఆ సినిమా రూపొందింది. అయితే తమిళనాడులో కుటుంబ సభ్యులపై ఆగ్రహంతో ఓ కోటీశ్వరుడు బిచ్చగాడిగా మారిన ఘటన తాజాగా వెలుగుచూసింది.
దాని వివరాల్లోకి వెళ్తే... విల్లుపురం జిల్లా సెంజి సమీపంలో ఉన్న దేవనూర్ కు చెందిన నటరాజన్ వ్యవసాయ కుటుంబీకుడు. కష్టపడి ఉన్నత స్థితికి చేరుకొని కోట్లాది రూపాయలు సంపాదించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులున్నారు. వారిలో ఒకరికి వివాహమైంది. కొద్ది నెలల క్రితం కోడలితో గొడవపడిన నటరాజన్ కోపంతో ఇల్లు వదిలి వెళ్లిపోయారు. రాష్ట్రం మొత్తం తిరిగి చివరకు 3 నెలల క్రితం కాంచీపురం జిల్లా తిరుప్పోరూర్ లోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వచ్చారు.
అక్కడ రోజూ గుడిలో పూజల అనంతరం పంపిణీ చేసే ప్రసాదం, అన్నదానంతో కడుపు నింపుకున్నారు. మరోపక్క, నటరాజన్ కోసం కుటుంబసభ్యులు పలు ప్రాంతాల్లో గాలిస్తూ ఆదివారం ఆలయానికి వచ్చారు. నటరాజన్ కనబడాలని మొక్కుకుని స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, ఆలయం మెట్లమీద దయనీయ స్థితిలో కూర్చున్న నటరాజన్ ను చూసి ఆశ్చర్యానందాలకు లోనయ్యారు.
పెద్ద మనసుతో తమను క్షమించి ఇంటికి రావాలని బతిమాలడంతో మెత్తబడిన నటరాజన్ వారితో పాటు కారులో తిరిగి వెళ్లారు. అప్పటి వరకు 'బిచ్చగాడు' అనుకున్న వ్యక్తి కోటీశ్వరుడని తెలియడంతో అక్కడి వారు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.