mp nagesh: ఇష్టం లేకపోతే నన్ను బదిలీ చేయించండి!: టీఆర్ఎస్ ఎంపీ నగేశ్ కి జిల్లా ఎస్పీ సూచన
- పోలీసులపై ఎంపీ విమర్శలు సరైనవి కాదు
- ఇష్టం లేకపోతే నన్ను బదిలీ చేయించండి
- ఎంపీ ఇంట్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎంపీ నగేశ్ ఇంట్లో రూ. 15 లక్షల విలువైన బంగారం, రూ. 2.50 లక్షల విలువైన వెండి, రూ. 70 వేల నగదు చోరీ అయిన సంగతి తెలిసిందే. ఈ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన దొంగను అరెస్ట్ చేసి, చోరీకి గురైన సొత్తులో సగాన్ని రికవరీ చేయగలిగారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు నగేశ్ పై జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇంట్లో జరిగిన దొంగతనానికి పోలీసులపై ఆరోపణలు చేయడం సరైనది కాదని అన్నారు. పోలీసులపై ఎంపీ వ్యాఖ్యలు దారుణమని అన్నారు. ఎంపీకి ఇష్టం లేకపోతే తనను వేరే చోటికి బదిలీ చేయించాలని చెప్పారు. దొంగతనం సమయంలో సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేయడంతో, పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో, పోలీసు విచారణ నెమ్మదిగా సాగింది. ఈ నేపథ్యంలో, పోలీసుల దర్యాప్తుపై నగేష్ విమర్శలు చేశారు.