జేఈఎం: జైషే మొహమ్మద్ ఆపరేషనల్ హెడ్ ఖలీద్ను హతమార్చిన భారత భద్రతా బలగాలు
- జమ్ముకశ్మీర్ బారాముల్లాలోని లదూరా ప్రాంతంలో ఎన్ కౌంటర్
- కార్డన్ సెర్చ్ జరపగా ఉగ్రవాదుల ఎదురు కాల్పులు
- ఖలీద్ హతమయ్యాడని ధ్రువీకరించిన భద్రతా బలగాలు
జైషే మొహమ్మద్ (జేఈఎం) ఆపరేషనల్ హెడ్ ఖలీద్ను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ రోజు జమ్ముకశ్మీర్ బారాముల్లాలోని లదూరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. పాకిస్థాన్ లో శిక్షణ పొంది భారత్లోకి చొరబడిన ఖలీద్ నార్త్ కశ్మీర్ లో ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం.
2016 అక్టోబర్లో బారాముల్లాలో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులపై దాడి చేసిన భద్రతా బలగాలకు ఖలీద్ గురించి తెలిసింది. అప్పటి నుంచి ఖలీద్ కోసం గాలిస్తున్నారు. ఈ రోజు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ జరపగా, ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా తమ చేతిలో ఖలీద్ హతమయ్యాడని భద్రతా బలగాలు ధ్రువీకరించాయి.