BJP: బీజేపీ ఎమ్మెల్యేపై స్మగ్లింగ్ ముఠా కాల్పులు.. తృటిలో తప్పించుకున్న వైనం!
- అసెంబ్లీలో స్థానిక ముఠాపై గొంతెత్తినందుకేనన్న ఎమ్మెల్యే
- తన నోరు మూయించేందుకే కాల్పులు జరిపారని వ్యాఖ్య
- పోలీసులకు ఫిర్యాదు.. నిందితుల కోసం గాలింపు
దుండగులు జరిపిన కాల్పుల నుంచి ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే తృటిలో తప్పించుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బీజేపీ శాసనసభ్యుడు సత్యావిర్ త్యాగి మీరట్‌లోని ఖద్రవలి గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్‌ను ప్రారంభించి వస్తుండగా ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. అయితే ఘటన నుంచి ఎమ్మెల్యే తృటిలో తప్పించుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆయుధాలు అక్రమ రవాణా చేసే ముఠానే తనపై దాడికి పాల్పడినట్టు త్యాగి అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఆయుధాల అక్రమ రవాణా బాగా పెరిగిందని, ఈ విషయాన్ని తాను అసెంబ్లీలో లేవనెత్తడంతో తనపై కక్ష పెంచుకున్న వారు తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని త్యాగి ఆరోపించారు. కాల్పుల ఘటనపై కితౌర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎమ్మెల్యే నుంచి ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పంకజ్ కుమార్ తెలిపారు.