సింగరేణి: రేపటి నుంచి లంచం తీసుకునేవాడిని, ఇచ్చేవాడిని, ఇప్పించేవాడిని చెప్పుతో కొట్టాలి: సీఎం కేసీఆర్
- ‘సింగరేణి’ కార్మికుల నుంచి లంచాలు తీసుకునే వారిపై మండిపడ్డ కేసీఆర్
- త్వరలోనే ‘సీఎం సింగరేణి’ యాత్ర చేస్తా
- అక్కడి ఆసుపత్రిలోనే బీపీ చెక్ చేయించుకుంటా
‘సింగరేణిలో రేపటి నుంచి లంచం తీసుకునేవాడిని, ఇచ్చేవాడిని, ఇప్పించేవాడిని చెప్పుతో కొట్టాలి’ అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రగతిభవన్ లో సింగరేణి కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి మెడికల్ బోర్డులో మొత్తం లంచాలే కనిపిస్తున్నాయని, అసలు, ఎందుకు కార్మికులు లంచాలు ఇవ్వాలని ప్రశ్నించారు.
‘క్వార్టర్ మారినా లంచం ఇవ్వాలంట.. అసలు ఎందుకు ఇవ్వాలి? సింగరేణి క్వార్టర్లకు నేనే స్వయంగా వస్తా’ అని, రాబోయే 20 రోజుల్లో ‘సీఎం సింగరేణి’ యాత్ర చేస్తానని, తానే స్వయంగా సింగరేణి కార్మికుల సమస్యలను సమీక్షిస్తానని చెప్పారు. సింగరేణి కార్మికుల దవాఖానా, క్వార్టర్స్ పరిశీలిస్తానని, అక్కడి ఆసుపత్రిలోనే తన బీపీ చెక్ చేయించుకుంటానని కేసీఆర్ అనడంతో చప్పట్లు మోగిపోయాయి.
సింగరేణి కార్మిక సంఘాల్లో సభ్యత్వం కింద నెలకు రూ.20 ఇచ్చేవారని, 53 వేలమంది కార్మికుల నుంచి నెలకు లక్షలాది రూపాయలు సభ్యత్వం కింద వస్తుందని, ఇకపై అంత మొత్తం వసూలు చేయవద్దని అన్నారు. ఇకపై సభ్యత్వం కింద కేవలం రూపాయి మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఇన్నాళ్లూ కార్మిక సంఘాల నేతలు బాగుపడ్డారని, కార్మికులు అలాగే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘లంచం ఇవ్వము, తీసుకోము’ అని ఈ సందర్భంగా సింగరేణి కార్మికులందరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. ఈ సందర్భంగా కొత్తగూడెం చీఫ్ మెడికల్ ఆఫీసర్ పై కేసీఆర్ మండిపడ్డారు. ఆ ఆఫీసర్ కు ఓ ఎంపీ 15 సార్లు ఫోన్ చేసినా పట్టించుకోలేదని ఆగ్రహించారు. అటువంటి ఆఫీసర్ మనకు వద్దని, ఆయన్ని తీసి పారేద్దామని అనడంతో కార్మికుల కరతాళధ్వనులతో మార్మోగింది.