జగన్: యజ్ఞాలకు రాక్షసులు అడ్డుపడ్డట్టు జగన్ అడ్డుపడుతున్నాడు: మంత్రి దేవినేని
- మీడియా సమావేశంలో దేవినేని
- పట్టిసీమపై జగన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలి
- పట్టిసీమ ద్వారా రూ.8 వేల కోట్ల పంట వచ్చింది
యజ్ఞాలకు రాక్షసులు అడ్డుపడ్డట్టుగా ప్రాజెక్ట్ లకు జగన్ అడ్డుపడుతున్నాడని ఏపీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పట్టిసీమపై చేసిన వ్యాఖ్యలకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ కడుతుంటే కోర్టుల్లో కేసులు వేయించారని, రైతులను వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఉభయగోదావరి జిల్లాల రైతులు వైసీపీ నేతల మాటలను తిప్పికొడుతున్నారని, పట్టిసీమ ద్వారా రూ.8 వేల కోట్ల పంట వచ్చి రైతులు లబ్ధి పొందారని, దీని ద్వారా 10 వేల కోట్ల పంట రావాలని కోరుకుంటున్నామని దేవినేని ఆకాంక్షించారు. సుజల స్రవంతిలో ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తామని, కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల అధికారులు కూర్చుని చర్చించుకుంటారని అన్నారు.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 882 అడుగులకు, సాగర్ లో నీటిమట్టం 518 అడుగులకు చేరిందని అన్నారు. పులిచింతల ప్రాజెక్ట్ లో 10 టీఎంసీలు, తుంగభద్ర జలాశయంలో 81 టీఎంసీల నీరు నిల్వ ఉందని, పట్టిసీమకు 71 టీఎంసీలకు పైగా నీరు విడుదల జరిగిందని, ప్రకాశం బ్యారేజ్ కు 60కి పైగా టీఎంసీల నీరు వచ్చిందని చెప్పారు.