Triumphant: విజయం సాధించిన వాద్‌నగర్ కుర్రాడు ప్రధానిగా తిరిగొస్తున్నాడు.. స్వగ్రామంలో మోదీకి స్వాగత తోరణాలు!
- వాద్‌నగర్‌కు ముందే వచ్చిన దీపావళి
- ఐదేళ్ల తర్వాత స్వగ్రామంలో అడుగుపెడుతున్న ప్రధాని మోదీ
- మర్చిపోలేని విధంగా స్వాగతానికి సిద్ధమైన పట్టణవాసులు
- మోదీ జీవిత చరిత్రతో బ్యానర్లు.. ఇంకా బోలెడు విశేషాలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వాద్‌నగర్ వాసులకు దీపావళి ముందే వచ్చింది. మోదీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఇక్కడికి వస్తుండడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఐదేళ్ల తర్వాత మోదీ ఆదివారం ఈ గడ్డపై అడుగుపెడుతుండడంతో పట్టణ ప్రజలు సంబరాలకు సిద్ధమయ్యారు.
వాద్‌నగర్ రోడ్లకు ఇరువైపులా దర్శనమిస్తున్న దాదాపు 50 బ్యానర్లు మోదీ బయోగ్రఫీని చెప్పేస్తున్నాయి. వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఆయన టీ అమ్మడం నుంచి ఆరెస్సెస్‌లో చేరడం వరకు అన్నింటినీ అందులో వివరించారు. అంతేకాదు నోట్ల రద్దు, విదేశాలతో సత్సంబంధాలు, బుల్లెట్ ట్రైన్ గురించి కూడా ప్రస్తావించడం గమనార్హం. అలాగే షర్మిష్ట సరస్సులో మోదీ స్నానం చేస్తున్నప్పుడు మొసలి నోటికి చిక్కబోయే సమయంలో స్నేహితుడు ఒకరు మోదీని రక్షించిన విషయాన్ని కూడా బ్యానర్లలో ప్రముఖంగా అచ్చేయించారు. గ్రాఫిక్ రూపంలో ఉన్న ఈ బ్యానర్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
శనివారం వాద్‌నగర్ రైల్వే స్టేషన్ మంత్రులు, ఐఏఎస్ అధికారులతో కిక్కిరిసిపోయింది. గతంలో మోదీ చాయ్ అమ్మిన స్టాల్ వద్ద నిల్చుని సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. నేడు (ఆదివారం) ఇక్కడే ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమం నిర్వహించనున్నారు. మోదీ చదువుకున్న బీఎన్ హై స్కూల్ అయితే కబడ్డీలో మోదీ ఉపయోగించే ట్రిక్కుల గురించి ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటోంది.
మోదీ బ్యాచ్‌మేట్లు ప్రధాని రాకకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గ్రామస్తులు అయితే శనివారమే రోడ్లను ఊడ్చేసి శుభ్రం చేశారు. విద్యుద్దీపాలతో ఇళ్లను అలంకరించుకున్నారు. కాగా, ఆదివారం తన వాద్‌నగర్ పర్యటనను ఉద్దేశించి మోదీ ట్వీట్ చేశారు. ఈ పర్యటన ఎన్నో మధుర జ్ఞాపకాలను తట్టిలేపుతుందని అందులో పేర్కొన్నారు.