sailaja kiran: కిరణ్ తో మార్గదర్శి ఎండీ శైలజ వివాహం ఎలా జరిగిందంటే..!

  • మాది ప్రేమ వివాహం కాదు
  • ఇద్దరం ఒకే కాలేజ్ లో చదువుకున్నాం
  • కిరణ్ వెళ్లిపోయిన రెండేళ్ల తర్వాత నేను కాలేజ్ లో జాయిన్ అయ్యా
  • మా ప్రొఫెసర్ నా పేరును రెకమెండ్ చేశారు
  • మంచి చెడ్డలన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత, నన్ను చూడటానికి వచ్చారు

కోయంబత్తూరులో తాను ఎంబీఏ చేశానని, అక్కడే కిరణ్ కూడా చదువుకున్నారని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ చెప్పారు. వాస్తవానికి తాను కిరణ్ ను క్యాంపస్ లో కలవలేదని, కిరణ్ వెళ్లిపోయిన రెండేళ్లకి తాను ఆ కాలేజ్ లో జాయిన్ అయ్యానని తెలిపారు. తమది లవ్ మ్యారేజ్ కాదని, అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పారు. తమ ప్రొఫెసర్ సంతాన లక్ష్మి అని ఉండేవారని... ఆమెకు కిరణ్ అంటే ఎంతో సదభిప్రాయం ఉండేదని తెలిపారు. తాను ఆ కాలేజ్ లో జాయిన్ అయిన సమయంలో... తన అత్తగారు కిరణ్ కు పెళ్లి చేయాలనుకున్నారని... మంచి అమ్మాయి ఉంటే చెప్పాలని సంతాన లక్ష్మిని అడిగినట్టున్నారని... అదే విషయాన్ని మేడమ్ తనకు చెప్పారని అన్నారు. 'శైలజా, నీ పేరు రెకమెండ్ చేశా' అంటూ ఆమె తనకు చెబితే, తాను షాక్ అయ్యానని చెప్పారు.

అప్పటికే 'ఈనాడు' ఒక పెద్ద సంస్థగా అవతరించిందని, తనకు కూడా ఈనాడు సంస్థ గురించి అవగాహన అప్పటికే ఉందని శైలజ చెప్పారు. అయితే, అప్పుడే పెళ్లి వద్దని కిరణ్ చెప్పినట్టు, ఆయన ఏదో ప్రాజెక్ట్ టేకప్ చేసినట్టు తనకు తెలిసిందని అన్నారు. ఈ కారణం వల్ల తన చదువు పూర్తి చేసే అవకాశం తనకు లభించిందని చెప్పారు. ఆ తర్వాత నాన్నతో కలసి ఓ ఆరు నెలలు తాను కూడా పని చేశానని... తనకు సంబంధాలు వస్తున్నా, నాన్నకు ఓ పట్టాన నచ్చలేదని తెలిపారు.

 మరోవైపు, తన గురించి ఈనాడు ఎంక్వైరీ చేసుకోవడం కూడా జరిగి పోయిందని అన్నారు. తన తండ్రి బ్యాక్ గ్రౌండ్, ఆయనకు చెందిన బాలాజీ హ్యాచరీస్, ఆయన సామాజిక సేవ, ఇలా అన్నీ ఎంక్వైరీ చేసుకున్నారని చెప్పారు. నాన్నగారికి రాయలసీమలో మంచి పేరు ఉందని తెలిపారు.

తనను చూసుకోవడానికి మామగారు, అత్తగారు, కిరణ్, అత్తగారి కుటుంబసభ్యులు అందరూ తిరుపతికి వచ్చారని శైలజ చెప్పారు. అప్పుడు తాను చాలా సన్నగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. తాను, కిరణ్ ఇద్దరూ ఒకే కాలేజ్ నుంచి రావడం వల్ల, తమకు మాట్లాడుకోవడంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పారు.

మాట్లాడుకోవడానికి తమకు ఒక గంట సమయం ఇచ్చారని... చాలా ఫ్రీగానే మాట్లాడుకున్నామని తెలిపారు. ఆ తర్వాత మూడు రోజులకు... అమ్మాయి మాకు చాలా నచ్చిందని తమకు ఫోన్ వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత తమ పెళ్లి జరిగిపోయిందని తెలిపారు. వెబ్ చానల్ ఐడ్రీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. 

sailaja kiran
eenadu kiran
margadarsi md sailaja kiran
sailaja kiran marriage
ramojirao
  • Loading...

More Telugu News