etv: నీది విషపూరిత మనస్తత్వం!: కోదండరామ్‌పై విరుచుకుపడ్డ కేసీఆర్
- కోదండరాం ఇన్నేళ్లలో కనీసం సర్పంచ్ అయినా అయ్యాడా?
- అమరుల స్ఫూర్తి యాత్ర అని రాజకీయం చేశాడు
- కోదండరామ్ జెండా ఏందీ? ఎజెండా ఏందీ?
- టీజేఏసీ ముసుగు తీసేసి బయటకు రావాలి
- పనికిమాలిన నలుగురు పోరగాళ్లని పెట్టుకుని జేఏసీ అంటున్నారు
టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భగ్గుమన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కోదండరాం ఇన్నేళ్లలో కనీసం సర్పంచ్ అయినా అయ్యాడా? అని ప్రశ్నించారు. 'అమరుల స్ఫూర్తి యాత్ర' అంటూ రాజకీయం చేశాడని ఆరోపించారు. తెలంగాణ వచ్చినప్పటికీ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని మాట్లాడుతున్నారని ఆయనపై మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలోనే చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగాయని, తాము సమర్థవంతంగా పాలిస్తున్నామని చెప్పారు. కోదండరామ్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని చెప్పారు.
'కోదండరామ్ జెండా ఏందీ? ఎజెండా ఏందీ?' అని కేసీఆర్ ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేయడమే కోదండరామ్ ఎజెండానా? అని ప్రశ్నించారు. ‘కేసీఆర్ తెలంగాణ తెచ్చింది నిజం కాదా? అబద్ధమా?’ అని అన్నారు. విద్యుత్ బిల్లులు తగ్గలేదు ఇదేనా తెలంగాణ? అంటున్నారని, టీచర్ ఉద్యోగాలు ఏవని విమర్శిస్తున్నారని చెప్పారు. ‘వస్తాయి అన్నీ వస్తాయి’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేని విధంగా చేశామని అన్నారు.
కోదండరామ్ ది విషపూరిత మనస్తత్వమని, ఆయన టీఆర్ఎస్ వ్యతిరేకి అని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. టీజేఏసీ ముసుగు తీసేసి బయటకు రావాలని, పనికిమాలిన నలుగురు పోరగాళ్లని పెట్టుకుని జేఏసీ అంటున్నారని అన్నారు. తెరాస ప్రభుత్వం మంచి పథకాలను అమలు చేస్తోందని అన్నారు. కోదండరామ్‌ను పట్టుకుని కాంగ్రెస్ పార్టీ మరింత నాశనమవుతోందని చెప్పారు. మొదటి నుంచి కోదండరామ్‌కి టీఆర్ఎస్ అంటే పడదని చెప్పారు. 2019లో కూడా తామే గెలుస్తామని వ్యాఖ్యానించారు.
సింగరేణి ఫలితాలు చూసైనా మారాలని కేసీఆర్ హితవు పలికారు. ఓట్ల రాజకీయం కావాలంటే కోదండరామ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని, ఇటువంటి రాజకీయాలు చేయకూడదని చెప్పారు. తెలంగాణ పాలన అద్భుతంగా కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. ఎవరు అడ్డుపడినా రాష్ట్రాభివృద్ధి ఇలాగే కొనసాగుతుందని చెప్పారు.