sexual harrasment: బ్యాంకుల్లో జాబ్ కోసం చూస్తున్న అమ్మాయిలకు హెచ్చరిక... ప్రైవేటు బ్యాంకుల్లో పెరిగిన లైంగిక వేధింపులు!
- వేధింపుల్లో ముందున్న ఐసీఐసీఐ
- ఆ తరువాత యాక్సిస్, హెచ్డీఎఫ్సీ
- ప్రభుత్వ బ్యాంకుల్లో తగ్గిన కేసులు
- వెల్లడించిన 'కాంప్లికారో సర్వీసెస్'
చక్కగా చదువుకుని బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం పొందాలన్న లక్ష్యంతో శ్రమించే అమ్మాయిలకు కాస్తంత ఆందోళన కలిగించే అంశమిది. ఇతర రంగాలతో పోలిస్తే బ్యాంకుల్లో లైంగిక వేధింపులు గణనీయంగా పెరిగిపోతున్నట్టు 'కాంప్లికారో సర్వీసెస్' గణాంకాలు వెల్లడించాయి. 2016-17 సంవత్సరంలో భారత స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన 25 బ్యాంకుల్లో 210 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 5 శాతం అధికం కాగా, అత్యధిక వేధింపులు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐలో నమోదయ్యాయి. ఆపై యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు నిలిచాయి.
బ్యాంకింగ్ రంగంలో పారదర్శకతతో పాటు ఉద్యోగుల్లో మరింత అవగాహన తెస్తేనే కేసుల సంఖ్య తగ్గుతుందని ఈ సందర్భంగా 'కాంప్లికారో సర్వీసెస్' అభిప్రాయపడింది. చాలా బ్యాంకుల్లో జీరో - టోలరెన్స్ వ్యవస్థలు ఉన్నాయని, అయితే, లైంగిక వేధింపుల ఫిర్యాదులన్నీ కూడా నిజమైనవేనని నమ్మేందుకు వీల్లేదని 'కాంప్లికారో సర్వీసెస్' ఫౌండర్ విశాల్ కేడియా తెలిపారు. 9 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేధింపుల సంఖ్య 2015-16తో పోలిస్తే 50 నుంచి 47కు తగ్గగా, 10 ప్రైవేటు బ్యాంకుల్లో మాత్రం కేసుల సంఖ్య 150 నుంచి 163కు పెరగడం ఆందోళన కలిగించే అంశమని ఆయన అన్నారు.