pakistan: ఇండియా దాడి చేస్తే.. మేమేమీ చేతులు ముడుచుకుని కూర్చోం!: విరుచుకుపడ్డ పాకిస్థాన్

  • భారత్ అడుగేస్తే మరుక్షణం మేమేంటో చూపిస్తాం
  • పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖావాజా ఆసిఫ్
  • చైనా, పాక్ లతో ఒకేసారి యుద్ధం చేయగల సత్తా ఉందన్న భారత్ వాయుసేన చీఫ్
  • ధనోవా వ్యాఖ్యలపై మండిపడ్డ ఖావాజా

ఒకేదఫా పాకిస్థాన్, చైనా సైన్యాలతో తలపడగల సత్తా తమకుందని, రెండు వైపుల నుంచి ఒకేసారి ముప్పు ఎదురైనా దేశాన్ని కాపాడుతామని భారత వాయుసేన చీఫ్ బీఎస్ ధనోవా చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ విరుచుకుపడింది. పాక్ లోని గుర్తించిన ఏ ప్రదేశంలోనైనా అణు బాంబు వేయగల శక్తి భారత సైన్యానికి ఉందని ధనోవా వ్యాఖ్యానించగా, అదే జరిగితే, తామేమీ చేతులు ముడుచుకుని కూర్చోబోమని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖావాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు.

తమ దేశాన్ని భారత్ టార్గెట్ గా చేసుకుందని తెలిసిన మరుక్షణం తామేంటో చూపిస్తామని అన్నారు. ఇండియాలో ఉన్న బంధాలను బలోపేతం చేసుకోవాలని తాము ప్రయత్నిస్తుంటే, ఆ దేశ ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని ఖావాజా వ్యాఖ్యానించారు. కాశ్మీర్ సమస్యే రెండు దేశాల మధ్యా అత్యంత కీలకమని అభిప్రాయపడ్డ ఆయన, తాము మాత్రం శాంతినే కోరుకుంటామని అన్నారు. ఇండియా నుంచి వచ్చే ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు.

కాగా, ప్రస్తుతం భారత వాయుసేనలో 33 ఫైటర్ స్క్వాడ్రాన్లు ఉండగా, 2032 నాటికి వాటిని 42కు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు ధనోవా వెల్లడించిన సంగతి తెలిసిందే. పీఓకేలోకి దూసుకెళ్లి సర్జికల్ దాడులు చేయాలన్న నిర్ణయం ప్రభుత్వానిదేనని, వారి ఆదేశాల మేరకే సైన్యం పని పూర్తి చేసిందని తెలిపారు. యుద్ధం వస్తే, తమ విమానాలు సరిహద్దులు దాటి ఆవలికి వెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి వస్తాయని వెల్లడించారు.సర్జికల్ దాడుల సమయంలో సరిహద్దులు దాటుతున్న సైన్యానికి అవసరమైన సాయాన్ని తాము అందించామని అన్నారు. తాము ప్రత్యక్షంగా మాత్రం పాల్గొనలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News