రఘువీరారెడ్డి: 'పుర' ప్రాజెక్టుకు చంద్రబాబు పథకం అని పేరు పెట్టుకోండి: రఘువీరారెడ్డి సలహా
- నెలలోపు పనులు ప్రారంభించకపోతే పార్టీలకు అతీతంగా పోరాటం
- కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 187 కోట్ల రూపాయలతో ప్రారంభించాం
- మూడు సంవత్సరాల లోపు ఈ పనులు పూర్తి చేయాలి
- ఈ ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేస్తున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 187 కోట్ల రూపాయలతో ప్రారంభించిన 'పుర' ప్రాజెక్టు పూర్తి చేస్తే కమీషన్లు రావు కాబట్టి దీనిని ముందుకు తీసుకుపోరా? అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. కావాలంటే, ఈ ప్రాజెక్టుకు 'పుర' అని పేరు తీసేసి 'చంద్రన్న పథకం' అని పెట్టుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దాన్ని మాత్రం పూర్తి చేయాలని అన్నారు. ఈ రోజు ఉదయం మైలవరం కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం మేరకు రఘువీరారెడ్డి, పీసీసీ నాయకులు ఇబ్రహీంపట్నంలోని పుర ప్రాజెక్టు పైలాన్, పుర ప్రాజెక్టు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఈ మధ్యన ఓ వ్యాధి వచ్చిందని అందరూ అంటున్నారని అన్నారు. అదేంటంటే, ప్రతి పథకానికి చంద్రబాబు అనే పేరు పెట్టుకునే వ్యాధి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆల్టిమేటం ఇవ్వడానికి వచ్చామని, నెల రోజులలోపు పుర ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కావాలని డిమాండ్ చేశారు. మూడు సంవత్సరాల లోపు ఈ పనులు పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ ను దక్కించుకున్న కాంట్రాక్టర్‌తో మాట్లాడితే తమకు డబ్బు రిలీజ్ చేస్తే పనులు రేపే ప్రారంభిస్తామంటున్నారని తెలిపారు. నెలలోపు పనులు ప్రారంభించకపోతే పార్టీలకు అతీతంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో పెద్ద ఎత్తున కొండపల్లి, ఇబ్రహీంపట్నంలలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని తీసుకువెళతామని హెచ్చరించారు. స్థానిక బంజరా మహిళాల సమస్యల పరిష్కారంపై కూడా కాంగ్రెస్ పార్టీ పొరాడుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే పట్టణంలో ఉన్నటువంటివి అన్ని సౌకర్యాలు వస్తాయి అన్నారు. ఈ ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నారు.