nobel: బ్రిటన్ రచయితకు నోబెల్ సాహిత్య పురస్కారం
- నోబెల్ స్వీడిష్ అకాడమీ ప్రకటన
- ఇప్పటివరకు ఎనిమిది నవలలు రాసిన కజువో ఇషిగురో
- మ్యాన్ బుకర్ ప్రైజ్ కూడా అందుకున్నారు
సాహిత్య రంగంలో 2017 నోబెల్ పురస్కారాన్ని జపాన్ సంతతికి చెందిన బ్రిటన్ రచయిత కజువో ఇషిగురోకి అందజేస్తున్నట్లు నోబెల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. నవలల్లో ఆయన రాసిన ఉద్వేగభరిత సన్నివేశాలు చదివే వారి మనసులను తాకుతాయని పేర్కొంటూ నోబెల్ కమిటీ అవార్డును ప్రకటించింది.
ఉదాహరణగా 1989లో కజువో రాసిన `ది రిమైన్స్ ఆఫ్ ది డే` నవలను పేర్కొంది. ఈ నవలకు ఆయన మ్యాన్ బుకర్ ప్రైజ్ కూడా గెల్చుకున్నారు. ఈ నవల ఆధారంగా అదే పేరుతో హాలీవుడ్‌లో సినిమా కూడా వచ్చింది. కజువో 2005లో రాసిన `నెవర్ లెట్ మీ గో` నవల సైన్స్ ఫిక్షన్ జానర్‌లో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. ఇప్పటివరకు ఎనిమిది వరకు నవలలు, కొన్ని సినిమాలకు స్క్రిప్టులను కజువో రాశారు. 2015లో ఆయన రాసిన `ద బరీడ్ జెయింట్` ఫాంటసీ నవల ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది.