hacking: అమ్మకానికి యూజర్ నేమ్‌లు, పాస్‌వర్డులు... హ్యాక్‌కి గురైన ఆర్బీఐ, డీఆర్‌డీఓ, ఈపీఎఫ్ఓ
- వెల్లడించిన సైబర్ సెక్యూరిటీ సంస్థ సెక్రైట్ సైబర్ ఇంటెలిజెన్స్
- దేశ ఇంటర్నెట్ రిజిస్ట్రీ నుంచి దాడి చేసిన హ్యాకర్
- కొన్ని ప్రైవేట్ సంస్థలపై కూడా దాడి
దేశంలో కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వెబ్‌సైట్లు హ్యాక్‌కి గురైనట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ సెక్రైట్ సైబర్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. హ్యాక్‌కి గురైన సైట్లలో భారతీయ రిజర్వ్ బ్యాంక్, డీఆర్‌డీఓ, ఈపీఎఫ్ఓ వంటి ప్రముఖ సంస్థల వెబ్‌సైట్లు ఉన్నాయని పేర్కొంది. ఆయా సంస్థలకు సంబంధించిన డేటాను హ్యాకర్ అమ్మకానికి పెట్టినట్లు సెక్రైట్ సైబర్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. భారతదేశ జాతీయ ఇంటర్నెట్ రిజిస్ట్రీ నుంచే ఈ దాడి జరిగినట్లు తమ విచారణలో తేలినట్లు చెప్పింది.
జాతీయ ఇంటర్నెట్ రిజిస్ట్రీ విభాగం జాతీయ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేస్తుంది. దీన్ని బట్టి చూస్తే దేశంలో చాలా ఐపీ అడ్రస్‌లు హ్యాక్‌కి గురై ఉండొచ్చని సంస్థ అభిప్రాయపడుతోంది. అయితే డేటాను కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు నటిస్తూ హ్యాకర్‌తో సంప్రదింపులు జరిపామని, అయితే అతను ఎక్కువగా విషయాలు వెల్లడించడానికి ఇష్టపడలేదని సంస్థ తెలియజేసింది. బాగా ఒత్తిడి చేయగా తన దగ్గర ఆర్బీఐ, డీఆర్‌డీఓ, ఈపీఎఫ్ఓ సంస్థల డేటా ఉన్న విషయాన్ని చెప్పాడని అంది. అలాగే హ్యాక్‌కి గురైన 6000 వరకు ఈ-మెయిళ్ల వివరాలను అతను పంపించాడని వివరించింది.