lasvegas: లాస్ వెగాస్ లో పరిమళించిన మానవత్వం... రక్తదానానికి బారులు తీరిన ప్రజలు!
- ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు అవసరమవుతున్న రక్తం
- రక్తదానం చేసేందుకు బారులు తీరుతున్న దాతలు
- రక్తం సేకరణకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రాలు
- రక్తదానం చేస్తున్న చైనా, జపాన్, స్విట్జర్లాండ్ దేశాల పర్యాటకులు
లాస్ వెగాస్ లో మానవత్వం పరిమళించింది. పెడ్డాక్ సృష్టించిన నరమేధంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రక్తం బాగా అవసరమవుతోంది. దీంతో క్షతగాత్రులకు రక్తమిచ్చేందుకు దాతలు భారీ సంఖ్యలో ముందుకు వస్తున్నారు. లాస్ వెగాస్ లోని రక్తనిధి కేంద్రాల ముందు గంటల తరబడి బారులు తీరి మరీ రక్తాన్ని దానం చేస్తున్నారు.
కేవలం స్థానికులు మాత్రమే కాకుండా చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తదితర దేశాల నుంచి సెలవులు గడిపేందుకు వచ్చిన పర్యాటకులు కూడా రక్తనిధి కేంద్రాల ముందు బారులు తీరడం విశేషం. రక్తదాతలు భారీ సంఖ్యలో రావడంతో ప్రత్యేక శిబిరాలు కూడా ఏర్పాటు చేసి, రక్తాన్ని సేకరిస్తున్నారు. రక్తనిధి కేంద్రాలు ఏర్పాటు చేసిన శిబిరాల వద్ద రక్తదానం చేసేందుకు బారులు తీరిన వారికి తినుబండారాలు, మంచినీటిని కొంతమంది వ్యాపారులు ఏర్పాటు చేసి, తమ గొప్ప మనసు చాటుతున్నారు.