శివాజీ రాజా: ‘లేనివన్నీ రాస్తాం మీరేం చేస్తారు’ అన్న రీతిలో ఉన్నారు: వెబ్‌సైట్లలో తప్పుడు రాతలపై శివాజీ రాజా
- వెబ్‌సైట్లలో, యూ ట్యూబ్ ఛానెళ్లలో సినిమా తారలపై గాసిప్స్
- మాకు నటుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి
- ఆయా నటులు అప్సెట్ అవుతున్నారు
- గాసిప్స్ పై రీడర్స్ క్లిక్ చేస్తే డబ్బులొస్తాయని వెబ్ సైట్ నిర్వాహకుల ఆశ
‘లేనివన్నీ రాస్తాం మీరేం చేస్తారు’ అన్న రీతిలో వెబ్‌సైట్ల నిర్వాహకులు ఉన్నారని మా (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. వెబ్‌సైట్లలో, యూ ట్యూబ్ ఛానెళ్లలో సినిమా తారలపై వస్తోన్న అసభ్యకర వార్తలు, గాసిప్స్‌పై శివాజీ రాజా ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... తమకు నటుల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. మొదట ఏం చేయాలో తమకు అర్థం కాలేదని, ఇప్పుడేం చేద్దామని ఆలోచించామని తెలిపారు.
ఈ గాసిప్స్‌ను తమ పిల్లలు చూస్తున్నారని, వారి ముందు ఎలా తలెత్తుకొని తిరగాలని నటులు అడుగుతున్నారని శివాజీ రాజా అన్నారు. తమపై ఇటువంటి రాతలు వస్తున్నందుకు ఆయా నటులు అప్సెట్ అవుతున్నారని చెప్పారు. తాను, సీనియర్ నటుడు నరేశ్ వెళ్లి పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశామని చెప్పారు. గాసిప్స్ పై క్లిక్ చేస్తే డబ్బులొస్తాయని, ఎంత మంది క్లిక్ చేస్తే అన్ని డబ్బులు వస్తాయని వెబ్‌సైట్ నిర్వాహకులు ఆశపడుతున్నారని అన్నారు. వారికొచ్చే డబ్బుల కోసం ఇలా నటుల జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పారు.