శశికళ: శశికళ భర్తకు కిడ్నీ, లివర్ మార్పిడి శస్త్రచికిత్స
- ఆపరేషన్ విజయవంతమైందన్న శశికళ మేనల్లుడు
- దాతల పేర్లు బయటపెట్టని వైనం
- శశికళకు ఈసారి పెరోల్ రావడం ఖాయమన్న దినకరన్
అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ భర్త నటరాజన్ కు కిడ్నీ, లివర్ మార్పిడి శస్త్ర చికిత్స ఈ రోజు జరిగింది. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా వైద్యులు నిర్వహించారని శశికళ మేనల్లుడు దినకరన్ వెల్లడించారు. అయితే, నటరాజన్ కు మూత్రపిండం, లివర్ దానం చేసిన దాతల వివరాలను మాత్రం ఆయన బయటపెట్టలేదు. శశికళకు పెరోల్ రాకపోవడంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు దినకరన్ స్పందిస్తూ, ఈసారి ఆమెకు కచ్చితంగా పెరోల్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
‘జైలు నుంచి బయటకు వచ్చాక పోయెస్ గార్డెన్ లోనే శశికళ ఉంటారా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘ముందు ఆమెను బయటకు రానివ్వండి..’ అని సమాధానం దాటవేశారు. ఇదిలా ఉండగా, అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను చూసేందుకు పెరోల్ ఇవ్వాలని కోరుతూ కర్ణాటక జైలు అధికారులకు శశికళ పెట్టుకున్న దరఖాస్తును నిన్న తిరస్కరించారు. వివరాలు అసంపూర్తిగా ఉండటంతో ఈ దరఖాస్తుని తిరస్కరించినట్టు జైలు సూపరింటెండెంట్ పేర్కొన్నారు. దీంతో, పూర్తి వివరాలతో కూడిన పెరోల్ దరఖాస్తును శశికళ ఈ రోజు మరోమారు సమర్పించడం గమనార్హం.