అనుష్కాశర్మ: ప్రియురాలు అనుష్క శర్మలో నచ్చే, నచ్చని అంశాల గురించి చెప్పిన కోహ్లీ!
- ఓ టీవీ షోలో కోహ్లీతో ఆమీర్ ఖాన్ చిట్ చాట్
- అనుష్క నిజాయతీగా వ్యవహరిస్తుందన్న టీమిండియా కెప్టెన్
- అయితే, ఆమెలో సమయ పాలన లేదన్న కోహ్లీ
బాలీవుడ్ నటి, తన ప్రియురాలు అనుష్క శర్మలో తనకు నచ్చేవి, నచ్చని అంశాల గురించి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ టీవీ షోలో వెల్లడించాడు. ఈ షో వ్యాఖ్యాతగా బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్ వ్యవహరించారు. ఈ షోలో భాగంగా కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ గురించి అమీర్ ప్రస్తావించారు.
‘అనుష్కలో మీకు నచ్చేవి, నచ్చని అంశాలు ఏమిటి?’ అని ప్రశ్నించగా, ‘ఆమె నిజాయతీ, జాగ్రత్తగా వ్యవహరించడం వంటి అంశాలు నాకు నచ్చుతాయి. ఇక, ఆమెలో నచ్చని విషయాల గురించి చెప్పాలంటే.. చెప్పిన సమయానికి ఎప్పుడూ రాదు. కొంచెం ఆలస్యంగా వస్తుంది. అయితే, నేను ఎప్పుడూ ఇబ్బందిగా ఫీలవలేదు’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
‘నేను నటించిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమాలు?’ అని అమీర్ ప్రశ్నించగా, ‘‘జో జీతా వహీ సికిందర్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ ఇష్టమని చెప్పాడు. వెంటనే స్పందించిన అమీర్.. ‘మీకు ‘పీకే’ ఇష్టమైన సినిమా అని నాకు తెలుసు. ఎందుకంటే, ఆ సినిమాలో అనుష్క శర్మ నటించిందిగా’ అనడంతో నవ్వులు విరిశాయి.