un water: గుర్మీత్ బాబా, హనీప్రీత్‌ల మద్దతు కోరుతూ ఐక్యరాజ్యసమితి విభాగం ట్వీట్
- షాక్ కు గురైన నెటిజన్లు
- `జోక్ ఆఫ్ ది మిలినీయం` అంటూ కామెంట్లు
- బాబా సేవలు ప్రపంచం గుర్తించిందన్న బాబా అభిమానులు
ఒకపక్క అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తూ గుర్మీత్ బాబా, నెలన్నర తర్వాత పోలీసులకు పట్టుబడి హనీప్రీత్‌లు దేశంలో వార్తల్లో నిలుస్తుంటే, మరో పక్క ఐక్యరాజ్యసమితి జల రక్షణ విభాగం వారు ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా టాయ్‌లెట్లు కట్టించుకోవాలని ప్రచారం చేయడంలో వారిద్దరి గొంతు కలపాలని కోరడం నెటిజన్లను షాక్‌కు గురిచేసింది.
ఐక్యరాజ్యసమితి జలరక్షణ విభాగం వారు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ ట్వీట్ చేశారు. `డియర్ హనీప్రీత్... మీరూ, గుర్మీత్ బాబా కలిసి ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా మాతో గొంతు కలుపుతారని ఆశిస్తున్నాం` అనేది ట్వీట్ సారాంశం. దీన్ని బట్టి చూస్తే ఐక్యరాజ్యసమితి ట్విట్టర్ అకౌంట్‌ను చూసుకునే వారికి బాబా, హనీప్రీత్‌ల ప్రస్తుత పరిస్థితి గురించి అవగాహన లేనట్లుగా కనిపిస్తోంది.
ఏదేమైనా, ఈ ట్వీట్‌పై నెటిజన్లు విభిన్న రకాలుగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. `జైలు నుంచి తప్పకుండా గొంతు కలుపుతారు`, `ఇంకో 20 ఏళ్ల తర్వాత మళ్లీ అడగండి` అంటూ నవ్వు పుట్టించే ట్వీట్లు చేశారు. `మీ ట్విట్టర్ అకౌంట్‌ను హర్యానా ప్రభుత్వం వాడుతోందా?` అంటూ ఐక్యరాజ్యసమితి జలరక్షణ విభాగాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ నేత ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేసింది.
ఇదిలా ఉండగా, డేరా బాబా, హనీప్రీత్‌లు చేసిన స్వచ్ఛంద కార్యక్రమాలను ఇన్నాళ్లకు ప్రపంచం గుర్తించి వారి సహాయాన్ని ఇప్పుడు కోరుతోందని బాబా అభిమానులు ట్వీట్ చేశారు. తర్వాత కొద్దిసేపటికి ఐక్యరాజ్యసమితి వారు ఈ ట్వీట్‌ను తొలగించారు.