team india: ఐపీఎల్ లో దూరం పెడతారనే ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేయడం లేదు: సెహ్వాగ్
- ఆసీస్ తో ఆట అంటే ముందుగానే మాటల యుద్ధం మొదలవుతుంది
- టీమిండియాతో సిరీస్ సందర్భంగా ఇంతవరకు నోరు జారని ఆసీస్ ఆటగాళ్లు
- ఐపీఎల్ యాజమాన్యాలు దూరం పెట్టే ఆలోచన చేస్తాయని గుబులు
ఆస్ట్రేలియాతో సిరీస్ అంటే మ్యాచ్ ల కంటే ముందు మైండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. తొలుత ఆసీస్ ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టులో కీలక ఆటగాడిని లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తారు. అతని బలహీనతలు శోధించామని, తమ దగ్గర అతనికి అస్త్రం ఉందని ప్రకటనలు ఇస్తారు. ఇక మ్యాచ్ లో దిగిన తరువాత స్లెడ్జింగ్ చేస్తారు. ఆటగాడి సహనాన్ని పరీక్షించే వ్యాఖ్యలతో ఆటను రక్తికట్టిస్తారు.
అయితే ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న సిరీస్ విభిన్నంగా జరుగుతోంది. ఇప్పటి వరకు ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ కి పాల్పడలేదు. దీనికి కారణాన్ని టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు తమను దూరంగా ఉంచుతాయనే భయంతోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్ కు పాల్పడటం లేదని అన్నాడు.
దుర్భాషలాడితే ఐపీఎల్ యాజమాన్యాలు వారితో ఒప్పందం చేసుకునేందుకు వెనుకాడతాయనే విషయం కంగారూలకు బాగా తెలుసని వీరూ చెప్పాడు. వన్డే సిరీస్ లో ఓటమికి కారణం ఆ జట్టు స్మిత్, వార్నర్, ఫించ్ లపై అతిగా ఆధారపడడమేనని సెహ్వాగ్ తెలిపాడు.