జనసేన: ఆ ట్వీట్ పొరపాటున చేశారు: ‘జనసేన’ మీడియా ప్రతినిధులు

  • 175 స్థానాల్లో పోటీ చేస్తామనే ట్వీట్ పై ‘జనసేన’ స్పందన
  • కొత్తగా చేరిన వ్యక్తి పొరపాటున ఈ ట్వీట్ చేశాడు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందంటూ ఆ పార్టీ ట్విట్టర్ ఖాతాలో నిన్న వెలువడిన ప్రకటన రాజకీయంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘జనసేన’ మీడియా ప్రతినిధులు స్పందిస్తూ, తమ పార్టీ సోషల్ మీడియా గ్రూప్ లో కొత్తగా చేరిన వ్యక్తి ఒకరు పొరపాటున ఈ ట్వీట్ చేశాడని చెప్పారు. కొన్ని రోజుల క్రితం తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ‘జనసేన’ సోషల్ మీడియా విభాగమైన శతఘ్ని డిజిటల్ రెజిమెంట్ ప్రతినిధుల సమావేశం నిర్వహించిన విషయాన్నిఈ సందర్భంగా వారు ప్రస్తావించారు.

‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందా?’ అని ఓ ప్రతినిధి ప్రశ్నించగా, ‘అప్పటి పరిస్థితులు, పార్టీ బలాన్ని అనుసరించి నిర్ణయం తీసుకుందాం’ అని పవన్ సమాధానం చెప్పారని అన్నారు. అయితే, ఈ సమాధానాన్ని పొరపాటుగా అర్థం చేసుకున్న ఓ వ్యక్తి ఈ ట్వీట్ చేశాడని ‘జనసేన’ మీడియా ప్రతినిధులు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశమై ప్రస్తుతం తమ పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని పేర్కొన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తామనే భావన వచ్చేలా నిన్నటి ట్వీట్ ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News