భారీ వర్షం: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోకి వర్షపు నీరు!
- భారీ వర్షంతో నగరవాసులకు ఇబ్బంది
- పలు కాలనీల్లోకి వర్షపు నీరు
- ఇళ్లలోకి నీరు చేరడంతో బయటకు రాలేకపోతున్న వైనం
హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైపోతున్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోకి కూడా వర్షపు నీరు చేరింది. చాదర్ ఘాట్, మూసానగర్, రసూల్ పురా, కమలానగర్ లలో ఇళ్లలోకి, మలక్ పేట్ లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ లోకి వర్షపు నీరు చేరింది. నల్లకుంట నాగమయ్య కుంటలోని ఇళ్లలోకి నీరు రావడంతో కాలనీవాసులు బయటకు వచ్చేశారు.
కార్వాన్ సర్కిల్ లోని మందులగూడ, హీరానగర్, కనకదుర్గ కాలనీ, సాయినగర్ బస్తీ వాసులూ అవస్థలు పడుతున్నారు. పక్కనే ఉన్న కాల్వ వర్షపు నీటితో నిండటంతో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేక ఇబ్బందిపడుతున్నారు. భారీ వర్షం కారణంగా శంషాబాద్ హైవేపై ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. కాగా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎమర్జెన్సీ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. శిథిలావస్థకు చేరిన భవానాల్లో నివసించే వారు తక్షణం వాటిని ఖాళీ చేయాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు.