గొల్లకురుమలు: రెండేళ్లలోగా గొల్లకురుమలు ధనవంతులవుతారు: సీఎం కేసీఆర్
- కేసీఆర్ ను కలిసిన కురుమల ప్రతినిధులు
- రెండేళ్ల తర్వాత అఖిల భారత షెఫర్డ్ కమ్యూనిటీ సభలు నిర్వహిస్తాం
- ప్రపంచంలోనే ధనవంతులైన యాదవులుగా ఈ కమ్యూనిటీ రూపుదిద్దుకోవాలి
- ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం లేని బీసీలకు శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించే ఆలోచనలో ముఖ్యమంత్రి
రాష్ట్రానికి చెందిన గొల్లకురుమలు రెండేళ్లలోగా ప్రపంచంలోనే ధనవంతులైన యాదవులుగా మారతారని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న అఖిల భారత కురుమల సమావేశం నిమిత్తం పలు రాష్ట్రాల ప్రతినిధులు వచ్చారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిశారు.
రాష్ట్రంలోని గొల్లకురుమల కోసం ప్రభుత్వం చేపట్టిన పథకంపై, తమ సామాజిక వర్గానికి ప్రభుత్వం ఇస్తున్న మద్దతుపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్పందిస్తూ, నలభై ఏళ్లకు పైగా ప్రజా జీవితంలో ఉన్న తనకు వారి అభివృద్ధి విషయమై ఏం చేయాలో స్పష్టత ఉందని అన్నారు. అంతేకాకుండా, తెలంగాణ ఉద్యమ సమయంలో, అధికారంలోకి వచ్చాక కూడా ఎంతో అధ్యయనం చేశామని చెప్పారు. ప్రకృతి ఇచ్చిన సంపదతో ఉత్పత్తి చేయనిదేమీ లేదని, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిదని ఈ సందర్భంగా కేసీఆర్ సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల వరకు యాదవ సోదరులు ఉన్నప్పటికీ, మాంసాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటం సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. ఈ విషయమై బాగా ఆలోచించి, చర్చించాక.. రూ.4500 కోట్లతో గొర్రెల పంపిణీ ప్రణాళిక రూపొందించామని వివరించారు. రెండేళ్లలో 84 లక్షల గొర్రెల పంపిణీ లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 23 లక్షల 80 వేల గొర్రెలను పంపిణీ చేసినట్టు చెప్పారు. రెండేళ్ల తర్వాత హైదరాబాద్ లో అఖిల భారత షెఫర్డ్ కమ్యూనిటీ సభలు నిర్వహిస్తామని, అప్పటికి ప్రపంచంలోనే ధనవంతులైన యాదవులుగా ఈ కమ్యూనిటీ రూపుదిద్దుకోవాలని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా గొల్లకురుమల సంఘం వసతి గృహానికి 10 ఎకరాల స్థలం, రూ. పది కోట్ల సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మరో ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం లేని బీసీలకు శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు.