india: కోహ్లీ సేనకు అగ్ని పరీక్ష... గెలిస్తేనే నంబర్ వన్!
- నాగపూర్ వేదికగా చివరి వన్డే నేడు
- విజయం సాధిస్తే వన్డేల్లో తొలి స్థానానికి
- ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ విజయం
- హోరాహోరీగా సాగనున్న మ్యాచ్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే 3-1 తేడాతో భారత జట్టు సిరీస్ ను గెలుచుకోగా, నేడు నాగపూర్ వేదికగా జరగనున్న మ్యాచ్ గెలుపు కోహ్లీ సేనకు అత్యంత కీలకం. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత క్రికెట్ టీమ్, వన్డేల్లో తొలి స్థానానికి చేరుకుంటుంది. వరుసగా మూడు మ్యాచ్ లను గెలుచుకున్న తరువాత టీమిండియా నంబర్ వన్ స్థానాన్ని చేరుకున్నప్పటికీ, నాలుగో వన్డేలో ఓటమి తరువాత తిరిగి రెండో ప్లేస్ కు ఇండియా పడిపోయింది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మూడో ప్లేస్ లో ఉంది. ఇక నేటి మ్యాచ్ లో భారత్ గెలిచి 4-1 తేడాతో సిరీస్ విజయాన్ని నమోదు చేస్తే, తిరిగి తొలి స్థానానికి చేరుకుంటుంది. దీంతో ఓ కీలకమైన అగ్ని పరీక్ష ముందు కోహ్లీ సేన ఉన్నట్టే. కాగా, నాలుగో వన్డేలో ఓడిపోవడంతో, బెంచ్ పై ఖాళీగా ఉన్న ఆటగాళ్లకు చివరి మ్యాచ్ లో స్థానం లభించే అవకాశాలు దాదాపు లేనట్టే.
ఈ మ్యాచ్ లో పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగి, విజయం సాధించాలని కోహ్లీ వ్యూహాన్ని రచిస్తున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచ్ ని కూడా గెలిచి, సిరీస్ లో తమ ఓటమి అంతరాన్ని తగ్గించుకోవాలని భావిస్తుండటంతో, మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయం.