Tata Motors: టాటా మోటార్స్‌కు బంపరాఫర్.. రూ. 1120 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ కార్ల తయారీకి ఆర్డర్!
- తొలి విడతలో 500 కార్ల సరఫరా
- మంత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వాడకం కోసమే
- మార్కెట్ రేటు కంటే 25 శాతం తక్కువ కోట్ చేసిన టాటా మోటార్స్
ప్రభుత్వ రంగ ఎనర్జీ ఎఫిషియెన్స్ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) నుంచి టాటా మోటార్స్ భారీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. రూ.1120 కోట్ల విలువైన 10 వేల ఎలక్ట్రిక్ కార్ల తయారీకి టాటా మోటార్స్‌కు ఆర్డర్ ఇచ్చినట్టు ఈఈఎస్ఎల్ తెలిపింది. ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది నవంబరు నాటికి మొదటి దశలో 500 ఈ-కార్లను టాటా మోటార్స్ సంస్థకు అందిస్తుంది. మిగతా 9,500 ఎలక్ట్రిక్ కార్ల (ఈవీ)లను రెండో దశలో అందిస్తుంది.
ఒక్కో ఈవీ కోసం టాటా మోటార్స్ (జీఎస్టీ కాకుండా) రూ.10.16 లక్షలకు కోట్ చేసినట్టు ఈఈఎస్ఎల్ తెలిపింది. జీఎస్టీతో కలిసి రూ.11.12 లక్షలకు అందించనున్నట్టు వివరించింది. ప్రస్తుతం ఉన్న ధరకంటే ఇది 25 శాతం తక్కువని పేర్కొంది. అంతేకాక 5 ఏళ్ల వారెంటీ కూడా ఇస్తున్నట్టు తెలిపింది. ఇష్యూ లెటర్ అందుకున్న నాటి నుంచి 9 నెలల కాలవ్యవధిలో 10 వేల కార్లను టాటా మోటార్స్ సరఫరా చేస్తుందని ఈఈఎస్ఎల్ ఎండీ సౌరభ్ కుమార్ తెలిపారు. టాటా మోటార్స్ సరఫరా చేసే ఈ ఎలక్ట్రిక్ కార్లను మంత్రులు, ప్రభుత్వ విభాగాలకు నేరుగా విక్రయించడం ద్వారా కానీ, లీజుకు ఇవ్వడం కానీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.