కేసీఆర్: కాంగ్రెస్, టీడీపీ హయాంలో సింగరేణి కార్మికులకు ఏమీ చేయలేదు: కేసీఆర్ ధ్వజం
- కార్మికుల కుటుంబాలు అనారోగ్యంతో బాధపడితే కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స
- ఇల్లు కట్టుకుంటామంటే పైసా వడ్డీ లేకుండా 6 లక్షల రూపాయల రుణం
- కేసీఆర్ ప్రకటన
గతంలో కాంగ్రెస్, టీడీపీలు ఎన్నో ఏళ్లు పరిపాలించినప్పటికీ, ఆయా పార్టీలు సింగరేణి కార్మికుల బాధలను మాత్రం పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో తాను కార్మికుల బాధలను గురించి తెలుసుకున్నానని అన్నారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనకు సింగరేణి కార్మికుల గురించి అంతగా తెలియదని చెప్పారు. డిపెండెంట్ ఉద్యోగాల అంశాన్ని అర్థం చేసుకోవడంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. దీనిపై అస్సలు దృష్టి పెట్టలేదని విమర్శించారు.
అండర్ గ్రౌండ్ మైన్లో పనిచేసే కార్మికులకు ఆక్సిజన్ కూడా సరిగా అందదని కేసీఆర్ అన్నారు. వాస్తవానికి సింగరేణిలో పనిచేసే కార్మికుల బతుకు చాలా దుర్భరంగా ఉంటుందని అన్నారు. రిటైర్ అయిన కార్మికులు పదేళ్లకు మించి బతకడం లేదని, అనారోగ్యంతో బాధపడుతుంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలని పునరుద్ధరిస్తామని మాటిచ్చామని, అమలు చేయడానికి నిర్ణయించాం కానీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీల నేతలు కోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వ ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టేసిందని చెప్పారు.
తాము న్యాయ నిపుణులతో మాట్లాడామని, డిపెండెంట్ ఉద్యోగాలు అనే పేరును తీసేసి, మరో పేరు పెట్టాలని సూచించారని కేసీఆర్ తెలిపారు. కారుణ్య నియామకాల కింద ఈ ఉద్యోగాలను కాపాడుకోవచ్చని అన్నారు. ఊ.. అంటే కోర్టుకి వెళుతూ కొందరు కార్మికులకు నష్టం కలిగిస్తున్నారని చెప్పారు. సింగరేణిలో పనిచేస్తోన్న కార్మికుల కుటుంబాలు అనారోగ్యంతో బాధ పడితే కార్పోరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తామని, అలాగే వారు ఇల్లు కట్టుకుంటామంటే 6 లక్షల రూపాయల పైసా వడ్డీలేని రుణం ఇస్తామని ప్రకటించారు.