Venezuela: ప్రపంచపటంలో వెనిజులా ఎక్కడుందో కూడా ట్రంప్‌కు తెలీదు... వెనిజులా అధ్యక్షుడి ఎద్దేవా!

  • స్పెయిన్ ప్రధానిపైనా విరుచుకుపడిన మదురో
  • వెనిజులా గురించి మాట్లాడడం మాని సొంత దేశంపై దృష్టి సారించాలని హితవు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రపంచ పటంలో వెనిజులా ఎక్కడ ఉందో కూడా తెలియదని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఎద్దేవా చేశారు. ‘‘ట్రంప్‌కు వెనిజులా ఎక్కడుందో తెలీదు. కావాలంటే ఆయనకో మ్యాప్ ఇచ్చి చూపించమనండి’’ అని మదురో అన్నారు. ప్రపంచంలో అమెరికానే అత్యంత నేర చరిత్ర కలిగిన దేశమని ఆరోపించారు. అమెరికాపై యుద్ధానికి సిద్ధంగా ఉండాలని తన సేనలకు పిలుపునిచ్చారు. క్షిపణులు, ట్యాంకులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే స్పెయిన్ ప్రధాని మరియానో రాజోయ్‌పైనా మదురో విరుచుకుపడ్డారు. అధిక ప్రసంగాలు కట్టిపెట్టాలని ఆయనను హెచ్చరించారు.

అమెరికా ఇటీవల వెనిజులా అధికారులపై ఆంక్షలు విధించింది. మానవహక్కులు, ప్రజాస్వామ్యం విషయంలో వెనిజులాపై ఒత్తిడి పెంచేందుకు స్పెయిన్ ప్రయత్నిస్తోంది. మదురో ఆగ్రహానికి ఇదే కారణం. స్పెయిన్ ప్రధాని తమ దేశం గురించి మాట్లాడడం మాని తొలుత వారి దేశంలోని అంతర్గత సమస్యలపై దృష్టి పెడితే మంచిదని మదురో హితవు పలికారు. వెనిజులాకు వ్యతిరేకంగా అసంబద్ధ, మోసపూరిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు.

వెనిజులాపై అమెరికా పలుమార్లు ఆంక్షలు విధించింది. మదురో ప్రభుత్వాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాలని యూరోపియన్ యూనియన్‌పై స్పెయిన్ గత కొంతకాలంగా ఒత్తిడి తీసుకొస్తోంది. కాగా, ట్రంప్, రాజాయ్ ఇద్దరూ రెండు రోజుల క్రితం వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మదురో ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News