america: అమెరికాలో అలజడి.. 24 గంటల్లో 28 సార్లు భూకంపం!
- లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతాలలో భూకంపం
- తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమైన ప్రకంపనలు
- 50 ఏళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో వరుస భూకంపాలు
- భయాందోళనలకు గురైన ప్రజలు
24 గంటల్లో 28 సార్లు భూమి కంపించడంతో లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కో వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వాటి వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, శాంక్రామెంటోలలో 24 గంటల్లోనే వరుసగా 28 సార్లు భూకంపాలు సంభవించాయని విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. ఉదయం నాలుగు గంటల నుంచి ఈ భూకంపాలు ప్రారంభమయ్యాయని వారు తెలిపారు.
1.5 మాగ్నిట్యూడ్ తో మొదటి భూకంపం రాగా, మరి కొద్దిసేపట్లోనే భూకంప తీవ్రత పెరిగి 2.6 మాగ్నిట్యూడ్ కు చేరిందని తెలిపారు. 50 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున భూమి కంపించడం సంభవించలేదని వారు చెప్పారు. వరుసగా సంభవించిన ఈ భూకంపాలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని అన్నారు. వీటి తీవ్రతకు పలు ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ప్రాణ నష్టంపై అంచనాకు రావాల్సి ఉందని వారు తెలిపారు.