child abuse: 'చిన్నారులపై లైంగిక వేధింపుల'పై డాక్యుమెంటరీలు... సినిమా థియేటర్లలో ప్రదర్శన
- సినిమాకు ముందు ప్రదర్శించేందుకు యోచిస్తోన్న కేంద్రం
- విరామ సమయంలో షార్ట్ ఫిల్మ్‌లు
- మొదట ఢిల్లీలోని 11 థియేటర్లలో అమలు
ఇటీవల చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో వాటి గురించి ఫిర్యాదు చేసే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినిమా హాళ్లలో అందుకు సంబంధించిన వీడియోలను ప్రసారం చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ యత్నిస్తోంది. సినిమా ప్రారంభానికి ముందు ఈ వీడియోలను ప్రసారం చేయడం ద్వారా ఫిర్యాదు చేసే విధానాల గురించి ఎక్కువ మందికి అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుందని ఆ శాఖ భావిస్తోంది.
అంతేకాకుండా, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే విధించే శిక్షల గురించి షార్ట్‌ఫిల్మ్‌లను సినిమా విరామ సమయంలో ప్రసారం చేసేందుకు కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రయోగాత్మంగా మొదట ఢిల్లీలోని 11 థియేటర్లలో ఈ వీడియోలను ప్రసారం చేసి, తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న సినిమాహాళ్లలో అమలు చేయనున్నారు. ఈ డాక్యుమెంటరీ వీడియోలను జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ రూపొందిస్తోంది.