ken cheng: ట్విట్టర్ వేదికగా జాతీయ పతాకాలను అవమానిస్తున్న బ్రిటిష్ హాస్యనటుడు!
- ప్రపంచంలోని అన్ని దేశాల పతాకాలకు ఏదో ఒక వంక
- నిజమేనా అనిపించేలా అవమానిస్తున్న వ్యక్తి
- వేల సంఖ్యలో రీట్వీట్లు
హాస్యాన్ని పండించడంలో సిద్ధహస్తుడైన బ్రిటిష్-చైనా కమెడియన్ ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను అవమానించడమే తన పనిగా పెట్టుకున్నాడు. `ఫ్లాగ్ డిస్రెస్పెక్ట్ 2017` పేరుతో ఇప్పటివరకు ప్రపంచంలో ఉన్న 195 దేశాల జాతీయ పతాకాలకు ఏదో ఒక వంక పెట్టాడు. ఒకసారి కెన్ చెంగ్ ట్విట్టర్ అకౌంట్ చూస్తే దేశాల జాతీయ పతాకాల చిత్రాలు, వాటికి ఆయన చేసిన కామెంట్లే కనిపిస్తాయి.
అతను ఒక్క లైనులో చేస్తున్న ఎగతాళి, హాస్యంతో పాటు ఆలోచింపజేసేలా ఉంటుంది. ఉదాహరణకు యునైటెడ్ కింగ్డమ్ జాతీయ జెండాలో `కర్ణాల (డయాగనల్స్) స్థానంలో ఉన్న గీతలు మధ్యలో ఎందుకు కలుసుకోలేదు?` అన్న ప్రశ్న ఇతర దేశాలతో బ్రిటన్ ఎక్కువగా కలుపుగోలుగా ఉండని వైఖరిని గుర్తుచేస్తుంది. అలాగే సైప్రస్ జాతీయ పతాకం దుస్తుల మీద పడిన కాఫీ మరకను ఆదర్శంగా తీసుకుని తయారుచేసినట్లు ఉంటుందని అనడం నిజమే అనిపిస్తుంది.
భారత దేశ పతాకం ఐర్లాండ్ దేశ పతాకాన్ని తిప్పేసి, దాని మీద ఒక బైక్ చక్రం పడేసినట్లుగా ఉంటుందని కెన్ ట్వీట్ చేశాడు. అంతేకాదు కొన్ని పతాకాలను విమర్శించడానికి కెన్ బూతులను కూడా ఉపయోగించాడు. పతాకాలపై ఇతడి కామెంట్లను కొంతమంది నెటిజన్లు స్వాగతిస్తూ రీట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల అన్ని దేశాల పతాకాలపై తాను చేసిన కామెంట్లన్నింటినీ ఒక ట్విట్టర్ థ్రెడ్ రూపంలో పోస్ట్ చేశాడు. దానికి ఇప్పటికి 15 వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి.