కేటీఆర్: ఇచ్చిన హామీలు అమలు చేయని కేటీఆర్ కు ఆ బిరుదు సరిపోతుంది!: షబ్బీర్ అలీ
- కేటీఆర్ కు ‘మిస్టర్ ఫెయిల్యూర్’ బిరుదు సరిపోతుంది
- ‘గల్ఫ్’లో మగ్గుతున్న తెలంగాణ వాసులపై ప్రభుత్వం దృష్టి సారించాలి
- సమగ్ర విధానం తీసుకురావాలి
- ఎన్ఆర్ఐ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్
ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన మంత్రి కేటీఆర్ కు ‘మిస్టర్ ఫెయిల్యూర్’ అనే బిరుదు సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సెటైర్ వేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కేటీఆర్, అవార్డుల ద్వారా ప్రచారం చేసుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యారని మండిపడ్డారు.
గల్ఫ్ దేశాల్లో మగ్గిపోతున్న తెలంగాణ వాసులను రాష్ట్రానికి తీసుకురావాలనే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం తక్షణమే సమగ్ర విధానం తీసుకురావాలని, ఎన్ఆర్ఐ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా నాడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.