smule: కాపీరైట్ విషయంలో మ్యూజిక్ యాప్‌కి నోటీసులు పంపించిన ఇళయరాజా!
- అక్రమంగా సొమ్ము చేసుకుంటోందని ఆరోపణలు
- అభిమానులకు ఉచితమే అంటున్న ఇళయరాజా
- గతంలో రేడియో స్టేషన్లు, సింగర్లకు కూడా కాపీరైట్ నోటీసులు
వర్ధమాన గాయనీ గాయకులకు ఎంతగానో ఉపయోగపడుతున్న స్మ్యూల్ మ్యూజిక్ యాప్‌కి మ్యూజిక్ మేస్ట్రో ఇళయ రాజా కాపీరైట్ ఉల్లంఘన నోటీసులు పంపించారు. ఇళయరాజా పాటలను కేరియోకో ఫార్మాట్‌లో అందజేసే స్మ్యూల్ యాప్ వెంటనే తమ పాటలను డేటాబేస్ నుంచి తొలగించాలని ఇళయరాజా కాపీరైట్ కన్సల్టెంట్ ప్రదీప్ కుమార్ తెలిపారు.
సంగీత దర్శకుడి అనుమతి లేకుండానే ఆయన పాటల మీద ఆ యాప్ సొమ్ము చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. గతంలో రేడియో స్టేషన్లు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర వంటి గాయనీ గాయకులు కూడా తన పాటల ద్వారా సొమ్ము చేసుకుంటున్నారని వారికి కూడా ఇళయరాజా కాపీరైట్ నోటీసులు పంపించారు. అయితే స్మ్యూల్ యాప్ విషయంలో కూడా ఇళయరాజా ఇలా చేయడంపై వర్ధమాన గాయనీగాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే అభిమానులను తన పాటలను ఉపయోగించుకోవద్దని ఇళయరాజా ఏనాడు చెప్పలేదని, కేవలం తన పాటల ద్వారా అక్రమంగా సొమ్ము చేసుకుంటున్న వాళ్ల మీద ఆయన వ్యతిరేకత చూపిస్తున్నారని ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు.