sasikala: మరింత క్షీణించిన శశికళ భర్త ఆరోగ్యం!
- కిడ్నీ, లివర్ పూర్తిగా దెబ్బతిన్నాయి
- నిత్యమూ డయాలసిస్ చేస్తున్నాం
- బులెటిన్ విడుదల చేసిన గ్లెనేజల్స్ హాస్పిటల్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ భర్త వీకే నటరాజన్ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది. గత 9 నెలలుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం పెరుంబాక్కంలోని గ్లెనేజల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రిలో ఉన్నారు. 74 ఏళ్ల నటరాజన్ కు కిడ్నీలు, ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయని, ఆయనకు తక్షణం కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సి వుందని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కే ఇల్లన్ కుమారన్ ఓ బులెటిన్ లో తెలిపారు.
ప్రస్తుతం ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. ఆయన ఆరోగ్యం క్రిటికల్ గానే ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై లేరని, నిత్యమూ డయాలసిస్ జరుగుతోందని తెలిపారు. కాగా, ఫిబ్రవరి 5న ఆయన ఆరోగ్యం విషమించడంతో తొలుత అపోలో ఆసుపత్రికి, ఆపై గ్లోబల్ హాస్పిటల్ కు ఆయన్ను తరలించిన సంగతి తెలిసిందే. గత రెండు వారాల్లోనే ఆయన పరిస్థితి విషమించిందని వైద్య వర్గాలు తెలిపాయి. రెండు అవయవాల మార్పిడి చేయాల్సి వుందని, దాన్ని ఆయన శరీరం ఏ మేరకు తట్టుకుంటుందన్నది తెలుసుకున్నాక ముందడుగు వేస్తామని ఓ సీనియర్ డాక్టర్ తెలిపారు.