mikerogers: వైట్ హౌస్ సమీపంలో సాయుధుడ్ని అరెస్టు చేసిన భద్రతాధికారులు!
- వైట్ హౌస్ సమీపంలో బహిరంగ మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్
- అనుమానాస్పద వైఖరితో కారులో తనిఖీలు
- కారులో అత్యాధునిక తుపాకులు, కత్తులు, అమ్మోనియా పేలుడు పదార్థాలు లభ్యం
- అదుపులోకి తీసుకుని విచారిస్తున్న భద్రతాధికారులు
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు సమీపంలో ఒక ఆగంతుకుడు అత్యాధునిక ఆయుధాలతో అరెస్టు కావడం పెనుకలకలం రేపింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..వైట్ హౌస్ సమీపంలో ఒక వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేస్తూ, అనుమానాస్పదంగా తిరగడాన్ని భద్రతాసిబ్బంది గుర్తించారు. దీంతో అతనిని 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా కూడలి వద్ద అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు.
అతని కారులో అత్యాధునిక ఏఆర్, ఏకే స్టైల్ రైఫిల్స్, పిస్టల్స్, మూడు కత్తుల వంటి మారణాయుధాలు, అమ్మోనియా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ డైరెక్టర్ అడ్మిరల్ మైక్ రోజర్స్, డిఫెన్స్ సెక్రటరీ జామ్స్ మాటీస్ తో మాట్లాడేందుకు వైట్ హౌస్ కు వెళ్తున్నానని సమాధానమిచ్చాడు. దీంతో వారంతా షాక్ తిన్నారు. ఇన్ని మారణాయుధాలతో వెళ్తూ, మాట్లాడేందుకు వెళ్లడమేంటని ప్రశ్నిస్తున్నారు. అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి తీసుకున్నారు.