markets: భారీగా పడిపోయిన దేశీయ మార్కెట్లు!
- సెన్సెక్స్ 296 పాయింట్లు, నిఫ్టీ 92 పాయింట్ల నష్టం
- ప్రారంభం నుంచే నష్టాల్లో ఉన్న మార్కెట్లు
- భారీగా పతనమైన రూపాయి మారకం విలువ
ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య నెలకొన్న యుద్ధవాతావరణ పరిస్థితుల కారణంగా దేశీయ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. సోమవారం నాటి ట్రేడింగ్ సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్లకు తీవ్ర నష్టాలు కొనితెచ్చింది. ప్రారంభం నుంచే చాలా మందగమనంతో నడిచిన మార్కెట్లు ఆద్యంతం నష్టాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 92 పాయింట్లు నష్టపోయింది.
240 పాయింట్లకు పైగా నష్టంతో ఈ రోజు 31,678 వద్ద బలహీనంగా ప్రారంభమైన సెన్సెక్స్, ఒక దశలో 370 పాయింట్ల వరకూ నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి కాస్త తేరుకుని 31,627 పాయింట్ల వద్ద 296 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా మార్కెట్ ముగిసే సమయానికి 92 పాయింట్ల నష్టంతో 9,873 వద్ద ముగిసింది.
మరోపక్క మార్కెట్ల ప్రభావం కారణంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా రూ. 65.07కు పడిపోయింది. ఇక విదేశీ పెట్టుబడుల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనపడింది. దాదాపు రూ.5,500 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. చాలా దేశాల మార్కెట్లపై కూడా అమెరికా, ఉత్తర కొరియాల ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం పడింది.
ఇక నిఫ్టీలో లాభపడిన కంపెనీల్లో టాటాపవర్, కోల్‌ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యునీలివర్ షేర్లు ఉన్నాయి. అలాగే ఏసీసీ లిమిటెడ్, అరబిందో ఫార్మా, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్, ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల షేర్లు నష్టపోయాయి.