గార్డియన్ డ్రోన్స్: గార్డియన్ డ్రోన్స్ ను కొనుగోలు చేయనున్న భారత్!
- చైనాకు చెక్ పెట్టనున్న భారత్
- 22 గార్డియన్ డ్రోన్స్ కొనుగోలుకు యూఎస్ తో త్వరలో ఒప్పందం
- ఎన్నో ప్రత్యేకతలు ‘గార్డియన్’ సొంతం
ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు భారత నావికాదళం సిద్ధమవుతోంది. తన అమ్ముల పొదిలో మరిన్ని అస్త్రశస్త్రాలను సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి గార్డియన్ డ్రోన్స్ ను కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. రిమోట్ తో ఆపరేట్ చేసే 22 సీ (సముద్ర) గార్డియన్ డ్రోన్స్ కొనుగోలుకు 2 బిలియన్ యూఎస్ డాలర్లతో ఒప్పందం చేసుకోనున్నట్టు సమాచారం.
ఎంతో అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ డ్రోన్స్ ను కనుక కొనుగోలు చేస్తే భారత్ నేవీ అమ్ముల పొదికి మరింత బలం చేకూరుతుందని ఓ సీనియర్ అధికారి ఈ సందర్భంగా తెలిపారు. కాగా, యూఎస్ రక్షణ శాఖ మంత్రి జేమ్స్ మాటిస్ త్వరలో భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గార్డియన్ డ్రోన్స్ కొనుగోలు అంశంపై ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, సీ గార్డియన్ డ్రోన్ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే.. 50,000 అడుగుల ఎత్తులో ఇది ఏకథాటిగా 27 గంటల పాటు ఎగురగలదు. మల్టీ మోడ్ మ్యారీ టైమ్ రాడార్ తో రూపొందే ఈ డ్రోన్ చైనా యుద్ధ నౌకలు, జలాంతర్గామిలు (సబ్ మెరైన్స్) కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టడం వంటి ప్రత్యేకతలు దీని సొంతమని చెప్పవచ్చు.