virat kohli: హార్దిక్ పాండ్యాకు ప్రమోషన్ పై డ్రస్సింగ్ రూమ్ సీక్రెట్ గురించి చెప్పిన విరాట్ కోహ్లీ

  • ఇండోర్ మ్యాచ్ విజయంలో పాండ్యా కీలక పాత్ర
  • రవిశాస్త్రి ఆలోచనతోనే ప్రమోషన్
  • ముందే చర్చించామని చెప్పిన విరాట్ కోహ్లీ

నిన్న ఇండోర్ లో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ పొంది నాలుగో స్థానంలో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా రాణించి, భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఐదో వికెట్ కు మనీష్ పాండేతో కలసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి మరో 13 బంతులు మిగులుండగానే 294 పరుగుల లక్ష్యాన్ని సాధించడంలో పాండ్యా పాత్ర ఎంతో ఉంది. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత జట్టుకు అతను కీలక ఆటగాడని పొగడ్తలు గుప్పించాడు.

బౌలర్ గా, బ్యాట్స్ మన్ గా రాణిస్తూ ఉన్న పాండ్యాను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు తీసుకురావడం వెనుక డ్రస్సింగ్ రూమ్ కు పరిమితమైన ఓ రహస్యాన్ని కోహ్లీ పంచుకున్నాడు. "అతని ప్రమోషన్ ఆలోచన తొలుత కోచ్ రవిశాస్త్రికి వచ్చింది. దీనిపై డ్రస్సింగ్ రూములో చర్చించాం. స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్న వేళ, అటాకింగ్ చేయగల ఆటగాడు కావాలని అనిపించింది. అతను విజయం సాధించాడు. మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు పాండ్యా" అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

 భారత క్రికెట్ జట్టులో అతని వంటి ఆల్ రౌండర్ ఉండటంతో సమతూకం పెరిగిందని చెప్పాడు. రోహిత్, రహానేలు కూడా పాండ్యా వంటి కీలక ఆటగాళ్లేనని, బ్యాటు చేతిలో ఉంటే రెచ్చిపోయి ఆడుతుండే పాండ్యా నుంచి మరిన్ని కీలక ఇన్నింగ్స్ రావాలని అభిలషించాడు. గత ఐదారేళ్లుగా మంచి ఆల్ రౌండర్ కోసం టీమిండియా వేచి చూస్తోందని, పాండ్యా రాకతో ఆ కోరిక తీరినట్లయిందని అన్నాడు.

కాగా, తాను ఏ స్థానంలోనైనా ఆడేందుకు ఇష్టపడతానని నిన్నటి మ్యాచ్ అనంతరం పాండ్యా మీడియా సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా నాలుగో వన్డే గురువారం నాడు బెంగళూరులో జరగనుంది.

  • Loading...

More Telugu News