haseena parkar: దావూద్ ఫ్యామిలీ కోసం దుబాయ్ లో రిలీజ్ కు ముందే 'హసీనా పార్కర్' ప్రత్యేక ప్రదర్శన

  • ఒకరోజు ముందే చిత్రాన్ని చూసిన దావూద్ కుటుంబీకులు
  • శ్రద్ధా కపూర్ నటనపై ప్రశంసల వర్షం
  • సోషల్ మీడియాలో కామెంట్లతో పసిగట్టిన నిఘా వర్గాలు

'హసీనా పార్కర్'... అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి జీవిత కథ ఆధారంగా తెరకెక్కి, గతవారంలో విడుదలైన చిత్రం. ఇందులో హసీనా పార్కర్ గా శ్రద్ధా కపూర్ చూపిన నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని విడుదలకు ఒకరోజు ముందే దుబాయ్ లోని ఓ ప్రముఖ మల్టీప్లెక్స్ లో దావూద్ కుటుంబ సభ్యుల కోసం ప్రదర్శించారని భారత నిఘా వర్గాలు కనిపెట్టాయి.

'రీల్ సినిమాస్' అనే థియేటర్ లో తాను అలీషా పార్కర్ తదితరులతో కలసి ఈ చిత్రాన్ని చూశానని, అద్భుతంగా ఉందని దావూద్ కుటుంబ సభ్యుడు ఒకరు సోషల్ మీడియాలో స్పందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం హసీనా సోదరుడు ఇక్బాల్ కస్కర్ పై దోపిడీ ఆరోపణలు విచారిస్తున్న థానే క్రైమ్ బ్రాంచ్ కి, ఈ చిత్రం దుబాయ్ లో ప్రదర్శించబడినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది.

పార్కర్, కస్కర్ కుటుంబీకులంతా దీనికి హాజరయ్యారని తెలుస్తోంది. పార్కర్ కుమారుడు అలీషా దీన్ని ఏర్పాటు చేశాడని, ఇన్వెస్టిగేషన్ ఏజన్సీలకు తెలియకుండా చిత్ర పదర్శనకు ఏర్పాట్లు చేసుకున్నారని, అయినా విషయం తమకు తెలిసిందని నిఘా వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. సినిమా చూసిన వారంతా హసీనాగా కపూర్ చూపిన నటనకు ఫిదా అయ్యారని, కొంతమంది తమ అనుభవాలను ఫోన్లు, సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారని ఐబీ వెల్లడించింది.

 కాగా, ఇదే విషయమై దుబాయ్ రీల్ సినిమాస్ ను సంప్రదించగా, ప్రస్తుతం ఆ చిత్రాన్ని తాము ప్రదర్శించబోవడం లేదని, ఏదైనా స్పెషల్ షోను ప్రదర్శిస్తే, ఆ విషయాన్ని తాము ఎవరితోనూ పంచుకోబోమని వెల్లడించడం గమనార్హం.

haseena parkar
dawood ibrahim
dubai
  • Loading...

More Telugu News