జూనియర్ ఎన్టీఆర్: నేను బాగా చేసిన డ్యాన్స్ ల్లో ఇది కూడా ఒకటి: జూనియర్ ఎన్టీఆర్
- ‘ట్రింగ్ ట్రింగ్’ పాటలో డ్యాన్స్ బాగా చేశా
- నాకు నచ్చిన డ్యాన్సుల్లో ఇది కూడా ఒకటి
- ‘రావణా..’ పాటను చంద్రబోస్ అద్భుతంగా రాశారు
జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రిభినయం చేసిన ‘జై లవ కుశ’ చిత్రానికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, ‘‘ట్రింగ్ ట్రింగ్..’ పాటలో డ్యాన్స్ నాకు బాగా నచ్చింది. నేను ఇప్పటి దాకా చేసిన డ్యాన్సుల్లో నాకు బాగా నచ్చిన వాటిల్లో ఇది కూడా ఒకటి. ఈ చిత్రంలో ప్రతి పాటకు ప్రాముఖ్యత ఉంది.
'కళ్లలోని కాటుక’ అనే పాట ఎక్స్ పెర్మెంటల్ సాంగ్. మనిషిలోని రెండు రూపాలను చూపించే పాట ఇది. ఆ తర్వాత, ‘రావణా..’ అనే పాట చాలా అద్భుతం. ఈ పాటను చంద్రబోస్ గారు కేవలం గంట సేపట్లో రాశారు. ‘ఈ పాటను గంటలో ఎలా రాశారు?’ అని చంద్రబోస్ గారిని నేను అడిగితే.. ‘రావణాసురుడు వచ్చి నాలో ప్రవేశించి ‘మర్యాదగా ఈ పాటను ఇప్పటికి ఇప్పుడు రాయి’ అని చెప్పి నాతో రాయించుకున్నారు’ అని చంద్రబోస్ గారు చెప్పారు’ అని జూనియన్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. తెలుగు సినీ ప్రేక్షకులు, అభిమానులు మంచి చిత్రాలను ఎప్పుడూ ఆదరించారు. వాళ్ల ఆశీర్వాదాలతో నన్ను ఇంతదూరం తీసుకువచ్చారు. ఆ ఆశీర్వాదాలు అలానే కొనసాగాలని కోరుకుంటున్నా'నని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు.