Pakistan: సర్జికల్ దాడుల తర్వాత పాక్ భయంతో వణికిపోయింది: లెఫ్టినెంట్ జనరల్
- మరిన్ని దాడులు జరుగుతాయని పాక్ భయపడింది
- మెరుపు దాడులతో ఇండియన్ ఆర్మీలో విశ్వాసం
- ఒక్క దాడితో ఉగ్రవాదం ఆగిపోదని ఆర్మీకి తెలుసు
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ గతేడాది నిర్వహించిన సర్జికల్ దాడుల తర్వాత పాక్ భయంతో వణికిపోయిందని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) డీఎస్ హూడా పేర్కొన్నారు. దాడులకు సంబంధించిన పలు విషయాలు ఇప్పటికీ అత్యంత రహస్యంగానే ఉండిపోయాయని అన్నారు. తనకు తెలిసినంత వరకు అదే రోజు రాత్రి ఇండియన్ ఆర్మీ పలు టార్గెట్లపై దాడి చేసిందన్నారు. అప్పట్లో నార్తరన్ కమాండర్‌గా ఉన్న హూడా తాజాగా మాట్లాడుతూ ఆర్మీ మెరుపు దాడులతో పాక్ బిక్కచచ్చిపోయిందన్నారు. పాక్ భయంతో వణికిపోయిందన్నారు. భారత్ వైపు నుంచి మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని పాక్ భయంతో గడిపిందని పేర్కొన్నారు.
భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌తో సైనికుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. క్రాస్-బోర్డర్ ఆపరేషన్లు మరిన్ని జరపగలిగే సామర్థ్యం వచ్చిందని వివరించారు. మెరుపు దాడులు సైనికుల్లో ధైర్యాన్ని నింపాయని హూడా పేర్కొన్నారు. అయితే ఒక్క సర్జికల్ స్ట్రైక్ వల్ల పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆపబోదని, చొరబాట్లు ఆగవన్న విషయం ఆర్మీకి తెలుసని హూడా స్పష్టం చేశారు.