Pakistan: ఐరాసలో పాక్ ప్రధాని మాట్లాడుతుంటే జనాలు పడీపడీ నవ్వారు..: సుష్మా స్వరాజ్
- ఆయన ఆ మాట అనగానే జనాలు నవ్వుకున్నారు
- భారత్ ఐటీలో సూపర్ పవర్.. మరి పాకిస్థాన్..?
- ఐరాసలో నిప్పులు చెరిగిన విదేశాంగ మంత్రి
ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ ప్రసంగాన్ని సభికులు ఎగతాళి చేశారని భారత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మ స్వరాజ్ అన్నారు. భారత్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందన్న ఆయన వ్యాఖ్యలకు జనాలు నవ్వు ఆపుకోలేకపోయారని మంత్రి అన్నారు. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న మాటలకు వారు పడీపడీ నవ్వారని పేర్కొన్నారు. ఆయన ప్రసంగాన్ని విన్నవారు ‘‘చూడండి.. ఎవరు, ఏం మాట్లాడుతున్నారో’’ అంటూ వెక్కిరించారని సుష్మ పేర్కొన్నారు.
ఐరాస సాధారణ సమావేశాల్లో పాక్ ప్రధాని అబ్బాసీ స్పీచ్‌ను గుర్తు చేసిన సుష్మ ఆయన ఆరోపణలను దెప్పి పొడిచారు. భారత్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంటే పాకిస్థాన్ తమతో ఘర్షణ కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘మీరేం ఉత్పత్తి చేస్తున్నారు? ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద క్యాంపులను’’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘లష్కరే తాయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హక్కానీ నెట్వర్క్..’’ ఇవన్నీ మీ గడ్డపై పుట్టినవేగా?’’ అని నిలదీశారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రపంచంలోనే భారత్ సూపర్ పవర్‌గా నిలిచిందని పేర్కొన్న సుష్మ.. పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాద కార్ఖానాగా మారిందని ఆరోపించారు. భూతం ఎప్పటికీ భూతమేనని, వీటిలో మంచి భూతం, చెడు భూతం అనేవి ఉండవని, ఉగ్రవాదంపై పోరాడి తీరాల్సిందేనని ఐరాసకు పిలుపునిచ్చారు.