పవన్: ప్రజాసమస్యలు మీ పరిధిలోకి రావా?: ఏపీ సర్కారుని ప్రశ్నించిన పవన్ కల్యాణ్
- డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ప్రైవేటీకరణపై ఉద్యోగుల నిరసన
- పవన్ ను ఆశ్రయించిన ఉద్యోగులు
- రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ఉద్యోగుల పక్షాన నిలబడాలన్న పవన్
- కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (డీసీఐ) ను ప్రైవేటీకరణ చేయనున్నారన్న ప్రకటనలతో ఆందోళన చెందుతున్న ఉద్యోగులు ఈ రోజు జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్‌ను కలిసి డీసీఐని ప్రయివేటీకరణ బారి నుంచి రక్షించాలని విన్నవించారు. డీసీఐ విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. అక్కడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొందరు హైదరాబాదుకి వచ్చి, జనసేన పరిపాలన కార్యాలయంలో పవన్‌కి తమ సమస్యలు చెప్పుకుని, డీసీఐ సంస్థను ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టడం దారుణమైన విషయమని అన్నారు.
దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇలా చేస్తే ప్రభుత్వ రంగ సంస్థలు నష్టపోతాయని చెప్పారు. అలాగే, ప్రత్యేక హోదా సాధించడంతో రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాలు తనకు తెలియట్లేదని అన్నారు. ఇప్పుడు ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్ ని ప్రైవేట్ పరం చేస్తోంటే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. తమిళనాడులో ఇటువంటి పనే చేయాలని చూస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు అండగా నిలబడిందని చెప్పారు. మరి ఏపీ ప్రభుత్వం ఎందుకు డీసీఐ ఉద్యోగుల పక్షాన నిలబడడం లేదని ప్రశ్నించారు. ఈ సమస్య తమ పరిధిలోకి రాదని అంటారా? ప్రజాసమస్యలు మీ పరిధిలోకి రావా? అని సర్కారుని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దీనిపై స్పందించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు.