యాపిల్ ఐఫోన్ 8: కూతురి కోసం ఐఫోన్ కొందామని.. భారత్ నుంచి సింగపూర్‌కు వెళ్లి రాత్రంతా స్టోర్ ముందే నిలబడ్డ తండ్రి!
- యాపిల్ ఐఫోన్ 8, 8 ప్లస్ కోసం బారులు తీరుతోన్న జనం
- కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో
- ఐఫోన్ 8 ప్లస్ కోసం సింగపూర్ వెళ్లిన భారత్‌కు చెందిన వ్యాపారవేత్త
- తన కుమార్తెకు పెళ్లి గిఫ్ట్ ఇవ్వనున్న వ్యాపారవేత్త
ఈ నెల 12న యాపిల్ ఐఫోన్ 8, 8 ప్లస్ విడుదలయిన విషయం తెలిసిందే. ఈ ఫోన్లు కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లు విక్రయిస్తోన్న స్టోర్ల ముందు ఐఫోన్ ప్రేమికులు బారులు తీరి కనిపిస్తున్నారు. కాగా, ఓ పెద్దాయన భారత్ నుంచి సింగపూర్‌కి వెళ్లి రాత్రంతా యాపిల్ స్టోర్ దగ్గరే లైనులో నిలబడి, ఉదయం ఆ షాపు తెరిచాక కొనుక్కున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే, భారత్‌కు చెందిన వ్యాపారవేత్త అమిన్ అహ్మద్ ధోలియా.. యాపిల్ ఐఫోన్ 8 ప్లస్‌ను కొని తన కుమార్తెకు పెళ్లి గిఫ్ట్ గా ఇద్దామన్న కోరికతో ప్రత్యేకంగా సింగపూర్ వెళ్లి, అక్కడి ఆర్చర్డ్ రోడ్‌లో ఉన్న యాపిల్ స్టోర్ కు చేరుకున్నాడు. మొన్న సాయంత్రం ఏడు గంటల నుంచి నిన్న ఉదయం ఎనిమిది గంటలకు లైనులో నిలబడి రెండు ఐ ఫోన్లు కొనుక్కున్నాడు.
ఈ సంఘటనపై ఆయన అక్కడి మీడియాతో మాట్లాడుతూ తాను రెండు ఐఫోన్స్ కొన్నానని, ఒకటి తన కూతురికి ఇస్తానని చెప్పాడు. తాను జీవితంలో మొదటిసారి రాత్రంతా క్యూలో 200 మందితో కలిసి నిలబడ్డానని, కష్టమనిపించినా ఆ అనుభూతి చాలా బాగుందని వ్యాఖ్యానించాడు.